Facebook: మేం ఎవరికీ కొమ్ముకాయడంలేదు... కాంగ్రెస్ పార్టీ ఆరోపణలకు బదులిచ్చిన ఫేస్ బుక్
- ఫేస్ బుక్ ది పక్షపాత ధోరణి అంటూ కాంగ్రెస్ ఆరోపణ
- ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకుంటోందని ఆగ్రహం
- వివరణ ఇచ్చిన ఫేస్ బుక్ డైరెక్టర్
ఫేస్ బుక్ భారత్ లో రాజకీయ పక్షపాతం చూపుతోందని, ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఫేస్ బుక్ భారత ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకుంటోందని, అధికార బీజేపీ సభ్యుల విద్వేష పూరిత ప్రసంగాలపై నిబంధనలు వర్తింపచేయడంలో కఠినంగా వ్యవహరించడంలేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది. అందుకు అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలను ఆధారాలుగా చూపుతోంది. దీనిపై ఫేస్ బుక్ స్పందించింది.
రాజకీయ పక్షపాతానికి పాల్పడుతున్నామన్న ఆరోపణలను కొట్టిపారేసింది. తాము ఎవరికీ వత్తాసు పలకడంలేదని, విద్వేషాలను, మత దురభిమానాలను ఎల్లప్పుడూ ఖండిస్తామని స్పష్టం చేసింది. ఫేస్ బుక్ అంటే ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్యక్తీకరించుకునే వేదిక అని ఉద్ఘాటించింది.
కాంగ్రెస్ వ్యాఖ్యలపై ఫేస్ బుక్ ప్రజావిధానం, విశ్వాసం, భద్రత విభాగం డైరెక్టర్ నీల్ పాట్స్ స్పందించారు. భారత్ లో తాము పక్షపాతంతో వ్యవహరిస్తున్నామన్న కాంగ్రెస్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించామని, తాము పక్షపాత ధోరణి పాటించడంలేదని, అత్యున్నత స్థాయిలో సమగ్రతను కాపాడతామని హామీ ఇస్తామని అన్నారు.