Andhra Pradesh: మద్యం ధరలను సవరించిన ఏపీ ప్రభుత్వం.. ఏ బ్రాండ్ తగ్గింది? ఏది పెరిగింది?
- క్వార్టర్ రూ. 150 కంటే తక్కువ ధర ఉన్న బ్రాండ్లపై రూ. 30 వరకు తగ్గింపు
- క్వార్టర్ రూ. 190 కంటే ఎక్కువ ఉన్న బ్రాండ్లపై భారీగా పెంపు
- అన్ని రకాల బీర్లపై రూ. 30 తగ్గింపు
మందుబాబులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. మద్యం ధరలను తగ్గిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. క్వార్టర్ మద్యం విలువ రూ. 150 కంటే తక్కువ ఉన్న బ్రాండ్లపై ధరను రూ. 30 వరకు తగ్గించింది. అన్ని రకాల బీర్లు, రెడీ టు డ్రింక్ మద్యంపై రూ. 30 తగ్గిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. రూ. 150 నుంచి రూ. 190 వరకు క్వార్టర్ ధర ఉన్న మద్యం రేటును యథాతథంగా ఉంచింది. అంతకంటే ఎక్కువ ధర ఉన్న మద్యంపై భారీ ఎత్తున రేట్లను పెంచింది. సవరించిన ధరలు ఈరోజు నుంచే అమల్లోకి వస్తాయని చెప్పింది.
ఏపీలో మద్యం ధరలు ఆకాశాన్నంటడంతో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో, అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు తక్కువ ధర ఉన్న మద్యం రేటును తగ్గించాలంటూ ప్రభుత్వానికి స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో నివేదికను అందించింది. ఈ నివేదిక ఆధారంగా ధరలను ప్రభుత్వం సవరించింది. మద్యం ధరలను భరించలేక పలు చోట్ల పేదలు శానిటైజర్లు తాగి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలను కూడా పరిగణనలోకి తీసుకున్న ఎస్ఈబీ ప్రభుత్వాన్ని తన నివేదికను అందించింది.