Narendra Modi: రూ.వంద కోట్లు దాటిన ప్రధాని మోదీ వ్యక్తిగత విరాళాల మొత్తం
- నమామి గంగే మిషన్ కు కోట్లలో విరాళాలు
- పీఎం కేర్స్ ఫండ్ కు కూడా తన వంతు విరాళం ఇచ్చిన మోదీ
- తనకు వచ్చిన బహుమతులు, జ్ఞాపికలను వేలం వేస్తున్న మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ ప్రజా సంక్షేమ పథకాలకు విరాళాలు ఇస్తున్నారు. వ్యక్తిగత హోదాలో అనేక పథకాలకు ఆయన అందించిన విరాళాల మొత్తం ఇప్పుడు రూ.103 కోట్ల పైచిలుకు అని తేలింది. చాలా నిరాడంబరంగా జీవించే మోదీ విరాళాల విషయంలో మాత్రం ఉదారంగా ఉంటారని అనేక సందర్భాల్లో వెల్లడైంది.
ఇటీవలే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్ కు కూడా ఆయన రూ.2.25 లక్షల విరాళం ఇచ్చారు. గతేడాది యూపీలో కుంభమేళా నిర్వహించిన సందర్భంగా పారిశుద్ధ్య సిబ్బంది సంక్షేమం కోసం రూ.21 లక్షలు, నమామి గంగే మిషన్ కు రూ.1.3 లక్షలు ఇచ్చారు. ఈ రూ.1.3 కోట్ల నగదు ఆయనకు దక్షిణ కొరియా అందించే సియోల్ శాంతి బహుమతి ద్వారా లభించింది.
నమామి గంగే మిషన్ కు 2015లో రూ.8.15 కోట్లు ఇచ్చారు. తనకు లభించిన వివిధ బహుమతులు వేలం వేసి ఈ నిధులు సమకూర్చారు. మరో సందర్భంలోనూ నమామి గంగే మిషన్ కు రూ.3.40 కోట్లు ఇచ్చారు. ఈసారి, తనకు ప్రదానం చేసిన జ్ఞాపికలు, ఇతర వస్తువులను వేలం వేశారు. ఇవేకాకుండా, అనేక కార్యక్రమాలకు మోదీ భారీగా విరాళాలు అందించారు.