KCR: పనికిమాలిన నిందలు వేసుకోవడానికి, అసహనం ప్రదర్శించడానికి అసెంబ్లీని వేదికగా చేసుకోవద్దు: సీఎం కేసీఆర్
- ఈ నెల 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- సమావేశాల నిర్వహణపై మంత్రులు, విప్ లతో సీఎం కేసీఆర్ సమావేశం
- వాస్తవాలు వివరించేందుకు మంత్రులు సిద్ధం కావాలని ఉద్బోధ
సెప్టెంబరు 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో మంత్రులు, విప్ లతో చర్చించారు. అసెంబ్లీలో జరిగే చర్చ సందర్భంగా వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు మంత్రులు సిద్ధం కావాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని రాజకీయ పక్షాలు ప్రతిపాదించిన అంశాలపై ఎన్నిరోజులైనా సరే చర్చించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ప్రజలకు సంబంధించిన ప్రతి విషయం సభలో చర్చకు రావాలనే తాము కోరుకుంటున్నామని చెప్పారు.
అయితే, అసెంబ్లీ అంటే అల్లర్లు, దూషణలు, తిట్లు, శాపనార్థాలు కాదని, పనికిమాలిన నిందలు వేసుకోవడానికి, అసహనం ప్రదర్శించడానికి అసెంబ్లీ వేదిక కారాదని సీఎం అభిప్రాయపడ్డారు. చర్చలు స్ఫూర్తిదాయకంగా ఉండాలని, వాస్తవాల ఆధారంగా చర్చ జరగాలని అభిలషించారు. ప్రజాస్వామ్య విలువలు వెల్లివిరిసేలా, దేశానికే ఆదర్శంగా ఉండేలా సభా సమావేశాలు జరగాలని ఉద్ఘాటించారు.
బీఏసీ సమావేశంలో ప్రభుత్వం పరంగా చర్చకు ప్రతిపాదించిన అంశాల జాబితా కాస్త పెద్దదిగానే ఉంది. కరోనా వ్యాప్తి-నివారణ, కరోనా బాధితులకు వైద్య సేవలు, రాష్ట్రంలో విస్తరించిన వైద్య సేవలు, భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం-సహాయక చర్యలు, శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాద ఘటన, విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు, కొత్త రెవెన్యూ చట్టం, నీటి పారుదల రంగం అంశాలు, పీవీ శతజయంతి ఉత్సవాలు, నియంత్రిత పద్ధతిలో పంటలసాగు తదితర అంశాలు ఈ జాబితాలో ఉన్నాయి.