Government Ads: ఏపీలో పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలపై హైకోర్టులో విచారణ
- అధికార పక్షానికి చెందిన పత్రికకు అధిక ప్రకటనలంటూ పిటిషన్
- సర్క్యులేషన్ ను పట్టించుకోవడంలేదని ఆరోపణ
- టీడీపీ వాళ్లు పిటిషన్ వేయించారన్న ప్రభుత్వ న్యాయవాది
రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన పత్రికకు అధిక స్థాయిలో ప్రకటనలు ఇస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. 52 శాతం ప్రకటనలు అధికార పక్షానికి చెందిన పత్రికకు ఇస్తున్నారని నాగశ్రవణ్ అనే సామాజిక కార్యకర్త హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ, ఈ పిటిషన్ ను టీడీపీ వ్యక్తులు వేయించారని ఆరోపించారు. ఈ పిల్ ను తిరస్కరించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఇక, పిటిషనర్ తరఫున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. సర్క్యులేషన్ ప్రకారం ప్రకటనలు ఇవ్వడంలేదని కోర్టుకు తెలిపారు. పైగా, పార్టీ రంగులతో ప్రకటనలు ఇవ్వడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని పేర్కొన్నారు. పత్రికలకు ప్రభుత్వం ప్రకటనలు ఇస్తున్న తీరు నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆరోపించారు. వాదనలు విన్న హైకోర్టు... కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.