Parliament: పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఎంపీలకు కొత్త నిబంధనలు జారీ!
- ఈ నెల 14న ప్రారంభంకానున్న పార్లమెంటు సమావేశాలు
- కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ తెచ్చుకోవాలంటూ ఎంపీలకు సూచన
- వ్యక్తిగత సిబ్బంది, కుటుంబ సభ్యులకు కరోనా ఉన్నా.. నో ఎంట్రీ
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 14న ప్రారంభంకాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయసభ సభ్యులకు లోక్ సభ, రాజ్యసభ సెక్రటరీలు కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. పార్లమెంటులోకి ప్రవేశించే ప్రతి ఎంపీ, వారి వ్యక్తిగత సిబ్బందితో పాటు పార్లమెంటు ఉద్యోగులందరూ కోవిడ్ టెస్టులు చేయించుకున్న రిపోర్టులు తప్పనిసరిగా తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. పార్లమెంటు సమావేశాలకు 72 గంటల ముందు (సెప్టెంబర్ 11 నుంచి) ఆర్టీ-పీసీఆర్ రిపోర్టులు తీసుకురావాలని సూచించారు.
టెస్టులు చేయించుకోని వారికి పార్లమెంటు రిసెప్షన్ వద్ద టెస్టులు చేస్తారని, అక్కడ రిపోర్టులు వచ్చేంత వరకు వేచి చూడాలని స్పష్టం చేసింది. రిపోర్టులు లేని వారిని లోపలకు అనుమతించబోమని తెలిపారు. కరోనా నెగెటివ్ వచ్చి, సింప్టొమేటిక్ లక్షణాలు ఉన్నవారిని కూడా అనుమతించబోమని... వారు హోమ్ ఐసొలేషన్ లో ఉండాలని చెప్పారు.
ఎంపీలందరూ వారి వ్యక్తిగత సిబ్బందికి, కుటుంబ సభ్యులకు కూడా కోవిడ్ టెస్టులు చేయించాలని తెలిపారు. వ్యక్తిగత సిబ్బంది కానీ, కుటుంబ సభ్యులు కానీ కరోనా బారిన పడితే... సదరు ఎంపీలు పార్లమెంటుకు రాకూడదని... ఐసొలేషన్ కు వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. ప్రతి ఎంపీ కూడా ఈ నిబంధనలను తప్పకుండా పాటించాలని కోరారు.
మరోవైపు పార్లమెంటు ప్రాంగణంలో 40 చోట్ల టచ్ లెస్ శానిటైజర్లను ఏర్పాటు చేయనున్నారు. ఎమర్జెన్సీ మెడికల్ టీమ్స్, అంబులెన్సులు అందుబాటులో ఉంటాయి.