FAU-G: పబ్జీకి దీటుగా కొత్త గేమింగ్ యాప్ 'ఫౌజీ'... అక్షయ్ కుమార్ ప్రకటన
- ఇటీవల పబ్జీని నిషేధించిన కేంద్రం
- ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా నూతన గేమింగ్ యాప్
- మెంటార్ గా వ్యవహరిస్తున్న అక్షయ్ కుమార్
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పబ్జీ మొబైల్ గేమింగ్ యాప్ ను నిషేధించిన నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన మేరకు 'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్' లో భాగంగా పబ్జీకి దీటైన మల్టీ ప్లేయర్ గేమ్ ను తీసుకువస్తున్నట్టు వెల్లడించారు. దీనికి 'ఫౌజీ' (FAU-G) అని నామకరణం చేశారు. FAU-G అంటే 'ఫియర్ లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్' అని అర్థం.
ఈ గేమ్ ను బెంగళూరుకు చెందిన ఎన్ కోర్ గేమ్స్ సంస్థ రూపొందించింది. అక్షయ్ కుమార్ మెంటార్ గా వ్యవహరిస్తున్నారు. దీనిపై అక్షయ్ కుమార్ స్పందిస్తూ, 'ఫౌజీ' గేమింగ్ యాప్ ద్వారా వినోదం మాత్రమే కాదని, భారత సైనికుల త్యాగాలను కూడా తెలియజేయబోతున్నామని వివరించారు. 'ఫౌజీ' యాప్ ద్వారా సమకూరే ఆదాయంలో 20 శాతం 'భారత్ కా వీర్' ట్రస్టుకు అందజేస్తామని వెల్లడించారు.