Hindi: తమిళనాడులో మరోసారి 'హిందీ' సెగలు!
- కర్ణాటకకు విడుదల చేసిన నీటిపై వివరణ కోరిన కావేరీ కమిటీ
- హిందీలో జవాబు పంపిన కేంద్ర జల సంఘం
- మండిపడిన కావేరీ కమిటీ సమన్వయకర్త మణియరసన్
తమిళనాడుకు హిందీ అంశంలో వివాదాలు ఇప్పటివి కావు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఆ వ్యతిరేకతకు మరింత ఆజ్యం పోశాయి. తాజాగా మరో ఘటన హిందీ వ్యతిరేక జ్వాలలు రగిల్చింది. అసలేం జరిగిందంటే... కర్ణాటకకు విడుదల చేసిన నీటి పరిమాణంపై వివరణ కోరుతూ తమిళనాడుకు చెందిన కావేరీ కమిటీ కేంద్ర జల సంఘాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా కోరింది. అయితే కేంద్ర జల సంఘం హిందీలో తన జవాబు పంపింది. దాంతో కావేరీ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తమిళనాడులో హిందీ అధికార భాష కాదని, వాడుక భాష కూడా కాదని కావేరీ కమిటీ సమన్వయకర్త, తమిళ నేషనలిస్ట్ పార్టీ నేత మణియరసన్ మండిపడ్డారు. తమిళనాడులో తమిళం, ఇంగ్లీషు మాత్రమే అధికారికంగా చలామణీ అవుతున్నాయని, అలాంటప్పుడు హిందీలో ప్రత్యుత్తరం ఎలా పంపిస్తారంటూ కేంద్ర జల సంఘాన్ని ప్రశ్నించారు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కులకు పూర్తి వ్యతిరేకం అని, తెలియని భాషలో సమాధానం ఇవ్వడం సరికాదని అన్నారు.