Parliament: రాజ్యసభ సభ్యులను వెంటాడుతున్న కరోనా భయం.. ఉభయ సభల్లో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు!
- 14 నుంచి పార్లమెంటు సమావేశాలు
- 72 గంటల ముందు సభ్యులకు కరోనా పరీక్షలు
- ఎక్కడికక్కడ శానిటైజర్ల ఏర్పాటు
రాజ్యసభ సభ్యులను కరోనా భయం వేధిస్తోంది. ఈ నెల 14వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజ్యసభ సభ్యుల ఆరోగ్యంపై వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సభలోని సభ్యుల్లో అత్యధిక శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారే కావడం. ఆ వయసు వారిలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటున్న నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాజ్యసభకు మొత్తం 244 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో 130 మంది 60 ఏళ్లు పైబడిన వారే కావడం ఆందోళనకు గురిచేస్తోంది. వీరిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. వయసు 87 ఏళ్లు. సభలో అందరికంటే ఆయనే పెద్దవారు. అకాలీదళ్ ఎంపీ సుఖ్‌దేవ్‌సింగ్ ధిండ్సా (84), టీఆర్ఎస్ నేత కె.కేశవరావు (81), అన్నాడీఎంకే సభ్యుడు ఎస్.ఆర్. బాలసుబ్రహ్మణ్యన్ (81)లు ఉన్నారు. దీంతో ఏ ఒక్కరూ కరోనా బారినపడకుండా ఉండేందుకు ఉభయ సభల్లోనూ కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సభలో భౌతిక దూరం పాటించేలా సీట్ల ఏర్పాటుతోపాటు ఎక్కడికక్కడ శానిటైజర్లు, 72 గంటల ముందు కరోనా పరీక్షలు చేయడాన్ని తప్పనిసరి చేశారు.