Telangana: తెలంగాణలో తగ్గని కరోనా ఉద్ధృతి.. కొత్తగా 2500కుపైగా కేసులు వెలుగులోకి!
- గత 24 గంటల్లో 2,511 కేసుల నమోదు
- జీహెచ్ఎంసీ పరిధిలో 305 కేసులు
- 877కు పెరిగిన మృతుల సంఖ్య
తెలంగాణలో కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో ఏకంగా 2,511 కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1,38,395కు పెరిగింది. నిన్న ఒక్క రోజే 11 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య 877కు చేరుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 305 కేసులు వెలుగుచూశాయి. ఇక, కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా భారీగా ఉండడం ఊరటనిచ్చే విషయం.
నిన్న ఒక్క రోజే 2,579 మంది కోలుకున్నారు. వీరితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,04,603 మంది కరోనా కబంధ హస్తాల నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో ఇంకా 32,915 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 62,132 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 16,67,653కు పెరిగింది. రాష్ట్రంలో 25,729 మంది హోం, సంస్థాగత ఐసోలేషన్‌లో ఉన్నారు.