Hizbul: 12 మందిని బందీలుగా చేసుకున్న టెర్రరిస్టులను కాల్చి చంపిన భారత బలగాలు
- బారాముల్లాలో భారీ ఎన్ కౌంటర్
- 12 గంటల పాటు కొనసాగిన ఎన్ కౌంటర్
- ముగ్గురు టెర్రరిస్టులను ఖతం చేసిన బలగాలు
జమ్మూకశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. దాదాపు 12 గంటల పాటు కొనసాగిన ఎదురు కాల్పుల్లో ఒక ఆర్మీ అధికారి కూడా గాయపడ్డారు. నిన్న జరిగిన ఈ ఘటన గురించి జమ్మూకశ్మీర్ పోలీసులు, సైన్యం ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. 12 మంది ప్రజలను టెర్రరిస్టులు బంధించారని, వీరిలో చిన్నారులు కూడా ఉన్నారని... ఈ క్రమంలో టెర్రరిస్టులను మట్టుబెట్టడమే కాకుండా, బందీలుగా ఉన్న వారి ప్రాణాలను కాపాడటం కూడా తమకు ప్రధానమైన అంశమని తెలిపాయి. ఉత్తర కశ్మీర్ లో బలపడేందుకు హిజ్బుల్ యత్నిస్తోందని చెప్పాయి.
నార్త్ కశ్మీర్ రేంజ్ డీఐజీ ముహమ్మద్ సులేమాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, టెర్రరిస్టులు ఆ ప్రాంతంలో ఉన్నారనే సమాచారంతో జిల్లా పోలీసులు, సైనికులు సంయుక్తంగా కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారని చెప్పారు. ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ముష్కరులు దాక్కున్నారని, తాము బిల్డింగ్ వద్దకు చేరుకోగానే ఉగ్రవాదులు కాల్పులను ప్రారంభించారని తెలిపారు. మన బలగాలు కూడా ఎదురు కాల్పులకు దిగాయని... ఇదే సమయంలో వారి చేతిలో బందీలుగా ఉన్న ప్రజల ప్రాణాలు తమకు ప్రధానమైనవని చెప్పారు. బందీలను సురక్షితంగా విడిపించిన తర్వాత ఎన్ కౌంటర్ ను పూర్తి చేశామని తెలిపారు.