KCR: కొత్త సచివాలయంలో 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మందిరం: కేసీఆర్
- కొత్తగా నిర్మించే సెక్రటేరియట్ లో మందిరం
- మసీదు, చర్చి నిర్మాణాలు
- పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతో పనులు
- త్వరితగతిన నిర్మాణం పూర్తి చేస్తాం
తెలంగాణలో కొత్త సచివాలయం భవనాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పాత సచివాలయ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసింది. అందులో భాగంగా అక్కడ దేవాలయాలు, మసీదులను సైతం కూల్చివేశారు. కొత్త సచివాలయ ప్రాంగణంలో వాటిని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ రోజు పలువురు రాష్ట్ర నేతలతో ఆయన భేటీ అయ్యారు.
"కొత్తగా నిర్మించే సెక్రటేరియట్ లో మందిరం, మసీదులు, చర్చిని పూర్తి ప్రభుత్వ ఖర్చులతో నిర్మిస్తామని, అసెంబ్లీ సమావేశాల తర్వాత గంగా జమునా తహజీబ్ కు అద్దం పట్టేలా ఒకే రోజు అన్ని ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన చేసి, త్వరితగతిన నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు" అని తెలంగాణ సీఎంవో పేర్కొంది.
"1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మందిర నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతుంది. నిర్మాణం పూర్తయ్యాక దేవాదాయ శాఖకు మందిరాన్ని అప్పగిస్తుంది. కొత్త సెక్రటేరియట్ ప్రాంతంలో తమకు కూడా ప్రార్థనా మందిరం కావాలన్న క్రిస్టియన్ల కోరిక మేరకు చర్చిని కూడా ప్రభుత్వం నిర్మిస్తుంది'' అని తెలిపింది
"తెలంగాణ రాష్ట్రం అన్ని మతాలను సమానంగా ఆదరిస్తుంది. పరమత సహనం పాటిస్తుంది. గంగా జమునా తహజీబ్ కు ప్రతీక. అందుకే కొత్త సెక్రటేరియట్ లో అన్ని మతాల ప్రార్థనా మందిరాలు నిర్మిస్తాం. అసెంబ్లీ సమావేశాల తర్వాత అన్నింటికి ఒకే రోజు శంకుస్థాపన చేస్తాం" అని కేసీఆర్ అన్నారని సీఎంవో తెలిపింది