Arvind Kejriwal: ఢిల్లీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కేజ్రీవాల్ స్పందన
- ఢిల్లీలో కరోనా పరీక్షల సంఖ్య పెంచాము
- అందుకే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది
- ప్రజలెవరూ భయపడొద్దు
- 14,000 పడకలు అందుబాటులో ఉన్నాయి
ఢిల్లీలో మొదట శరవేగంగా పెరిగిపోయిన కరోనా వైరస్ కేసులు ఇటీవల తగ్గాయి. అయితే, మళ్లీ కేసుల ఉద్ధృతి అధికం అవుతోంది. దీనిపై సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ.. తాము ఢిల్లీలో కరోనా పరీక్షల సంఖ్య పెంచడం వల్లే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని చెప్పుకొచ్చారు.
దీనికి ప్రజలెవరూ భయపడక్కర్లేదని, కరోనాపై తాము యుద్ధం ప్రకటించామని కేజ్రీవాల్ తెలిపారు. పరీక్షల సంఖ్యను రెట్టింపు చేస్తున్నామని చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్ చేసి, వారికి చికిత్స అందిస్తున్నామని అన్నారు. కరోనా వల్ల తలెత్తే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తమ సర్కారు సన్నద్ధంగా ఉందని కేజ్రీవాల్ తెలిపారు. కొవిడ్ మరణాలను తగ్గించేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ఆసుపత్రుల్లో పడకలకు కొరత లేదని, 14,000 పడకలు అందుబాటులో ఉన్నాయని, వాటిలో ప్రస్తుతం 5,000 పడకలు మాత్రమే వినియోగిస్తున్నామని కేజ్రీవాల్ తెలిపారు. కాగా, నిన్న ఢిల్లీలో 36,219 పరీక్షలు చేయగా 2,914 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.