Corona Virus: వ్యాక్సిన్ విషయంలో ట్రంప్ మాటల్ని విశ్వసించలేం.. వ్యాక్సిన్ సమర్థతపై అనుమానాలు: కమలా హారిస్
- నవంబరు నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న ట్రంప్
- ఎన్నికల గిమ్మిక్కేనంటూ విమర్శలు
- ఎన్నికల్లో లబ్ధిపొందడం కోసమేనంటూ మండిపాటు
కరోనా వైరస్ టీకా విషయంలో డొనాల్డ్ ట్రంప్ చెప్పే మాటల్ని విశ్వసించడానికి లేదని అమెరికా ఉపాధ్యక్ష బరిలో ఉన్న కమలా హారిస్ పేర్కొన్నారు. ట్రంప్ చెబుతున్నట్టుగా ఎన్నికల నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా దాని సామర్థ్యం, భద్రతపై తనకు నమ్మకం లేదన్నారు. ఎన్నికల్లో లబ్ధిపొందడం కోసమే వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేయాలని ట్రంప్ ఆయా సంస్థలపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపణలున్న నేపథ్యంలో కమలా హారిస్ కూడా అటువంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం.
ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ ఈ ఏడాది చివరి నాటికి, లేదంటే అంతకంటే ముందే వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ట్రంప్ చెబుతున్న దాంట్లో నిజం లేదని, అదంతా ఎన్నికల గిమ్మిక్కేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు, నవంబరు 1 నాటికి వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.