Raghurama Krishnaraju: రథం ఘటన వెనుక ఏ మతస్తులు ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలి: రఘురామకృష్ణరాజు
- అంతర్వేదిలో అగ్నిప్రమాదం
- కాలిబూడిదైన స్వామివారి రథం
- ఘటనపై అనుమానాలు ఉన్నాయన్న రఘురామ
అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పుణ్యక్షేత్రంలో ఆరు దశాబ్దాల నాటి రథం మంటల్లో చిక్కుకుని కాలిబూడిదవడం పట్ల నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఈ ఆలయం ఎంతో పురాతనమైనదని, క్రీస్తు పూర్వం 300 ఏళ్ల నాటిదని, రథం 63 ఏళ్ల కింద నిర్మితమైనదని తెలిపారు. ఎంతో ప్రసిద్ధి చెందిన రథం కాలిపోవడం దురదృష్టకరమని, అయితే రథం ఒకేసారి కింది నుంచి పైవరకు కాలిపోయిన విధానం చూస్తుంటే విద్రోహ చర్యలానే అనిపిస్తోందని అన్నారు.
గతంలో కొన్నిచోట్ల ఇలాగే జరిగితే, ఎవరో పిచ్చివాళ్లు చేశారంటూ కేసులు మూసేశారని, ఇప్పుడు కూడా పిచ్చివాడు చేసిన పిచ్చిచేష్టలా భావించి కేసును క్లోజ్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్టుందని అభిప్రాయపడ్డారు. చూడబోతే ఇది ఒక మతంపై జరిగిన దాడిలా అనిపిస్తోందని, సీఎం జగన్, మంత్రి వెల్లంపల్లి వంటివారు దయచేసి స్టేట్ మెంట్లు ఇవ్వడంతో సరిపెట్టకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది చిన్న చర్య అని, పిచ్చివాడు చేసిన చర్య అని తీసుకోకుండా, డీజీపీతో మాట్లాడి నిందితుడు ఏ కులస్తుడైనా, ఏ మతస్తుడైనా కఠినచర్యలు తీసుకోవాలని అన్నారు.