Perni Nani: విద్యుత్ మీటర్ల ఏర్పాటు ఎందుకో చెప్పిన మంత్రి పేర్ని నాని

AP Minister Perni Nani explains why they have been establishes meters

  • ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటు
  • నాణ్యమైన విద్యుత్ అందించేందుకేనన్న మంత్రి
  • కనెక్షన్లపై పరిమితులు లేవని వెల్లడి

ఏపీలో ఉచిత విద్యుత్ పథకం అమలవుతున్న వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఉచిత విద్యుత్ పథకానికి మంగళం పాడేందుకే విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. వాడుకున్న విద్యుత్ కు నేరుగా రైతుల ఖాతాలోకి నగదు బదిలీ చేస్తామని ఏపీ సర్కారు చెబుతున్నా విపక్షం నుంచి విమర్శలు మాత్రం ఆగడంలేదు. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

రైతులకు మునుపటి కంటే నాణ్యమైన విద్యుత్తు అందించేందుకే మీటర్ల బిగింపు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటుతో విద్యుత్ వినియోగం వివరాలు తెలుస్తాయని, అందువల్ల ఎంత సరఫరా చేయాలన్నన దానిపై ఓ అవగాహన వస్తుందని అన్నారు.

"రైతులకు మీటర్లు బిగించే బాధ్యత ప్రభుత్వానిదే. ప్రతి రైతుకు ఎన్ని కనెక్షన్లు ఉన్నా, వాటిపై ఎలాంటి పరిమితులు లేవు. వ్యవసాయ అవసరాల కోసం వినియోగించే విద్యుత్ పై పరిమితులు లేవు. వాళ్లు ఎంత అవసరం ఉంటే అంత వాడుకోవచ్చు. అయితే మీటర్లు ఏర్పాటు చేయడం వల్ల ఎంత వాడుకుంటున్నారో తెలుస్తుంది. తద్వారా ఆ మీటర్లకు సంబంధించిన ట్రాన్స్ ఫార్మర్లపై ఎంత లోడు పడుతుందో అర్థమవుతుంది.  దాంతో ఆ ట్రాన్స్ ఫార్మర్ సామర్థ్యం పెంచడానికి, ఆ సబ్ స్టేషన్ సామర్థ్యం పెంచడానికి వీలవుతుంది. లో ఓల్టేజ్ సమస్య నివారించడానికి ఈ మీటర్ల ఏర్పాటు ఉపయోగపడుతుంది" అని వివరించారు.

  • Loading...

More Telugu News