Corona Virus: బెంగళూరు మహిళకు నెల రోజుల వ్యవధిలో రెండోసారి కరోనా!
- కరోనా లక్షణాలతో జులైలో ఆసుపత్రిలో చేరిక
- కోలుకున్న తర్వాత మళ్లీ ఆగస్టులో సోకిన మహమ్మారి
- కారణాలు అన్వేషిస్తున్న వైద్యులు
బెంగళూరులో ఓ మహిళ నెల రోజుల వ్యవధిలో రెండోసారి కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. నగరానికి చెందిన 27 ఏళ్ల మహిళ కరోనా లక్షణాలతో జులై మొదటి వారంలో ఆసుపత్రిలో చేరింది. ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. చికిత్స అనంతరం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ రావడంతో అదే నెల 24న ఆమెను డిశ్చార్జ్ చేశారు. అయితే, సరిగ్గా నెల రోజుల తర్వాత గత నెల చివర్లో మళ్లీ కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరింది. దీంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు బెంగళూరులోని ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యుడు ప్రతీక్ పాటిల్ తెలిపారు. నగరంలో రెండోసారి కరోనా సోకిన తొలి వ్యక్తి ఆమేనని పేర్కొన్నారు.
వ్యాధి సంక్రమించిన తర్వాత ఆమెలో వ్యాధినిరోధక శక్తి పెరగకపోవడమో, లేదంటే అభివృద్ధి చెందిన యాంటీబాడీలు నశించిపోవడం వలనో ఆమెకు రెండోసారి కరోనా సోకి ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. రెండోసారి కరోనా సంక్రమించడంపై ఇప్పటికే పలు పరిశోధనలు జరుగుతున్నాయి. కోలుకున్న తర్వాత వారి శరీరంలో మిగిలి ఉన్న వైరస్ అవశేషాలు, లేదంటే ఇన్ఫెక్షన్ తిరగబెట్టిందా? లేక అది కొత్తగా సోకిందా? అన్న విషయంలో ఇప్పటి వరకు శాస్త్రవేత్తల్లో స్పష్టత లేదు. కాగా, నెదర్లాండ్స్, బెల్జియంలలోనూ రెండోసారి కరోనా బారినపడిన కేసులు వెలుగుచూస్తున్నాయి.