civial aviation: లాక్‌డౌన్ ఎఫెక్ట్.. విమాన ప్రయాణికులకు పూర్తిస్థాయి రిఫండ్
- ప్రజాప్రయోజన వ్యాజ్యంపై స్పందించిన కేంద్రం
- వచ్చే ఏడాది మార్చి 31 వరకు క్రెడిట్ షెల్‌కు అవకాశం
- టికెట్‌ను వేరొకరికి బదిలీ చేసే అవకాశం
కరోనా లాక్‌డౌన్ సమయంలో విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఇది శుభవార్తే. ఆ సమయంలో టికెట్లు బుక్ చేసుకున్న వారికి పూర్తిస్థాయి చెల్లింపులు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ప్రవాసీ లీగల్ సెల్ అనే ఎన్జీవో ఇటీవల సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా, దీనిపై సమాధానం చెప్పాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది. స్పందించిన డీజీసీఏ.. లాక్‌డౌన్ సమయంలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు విమానయాన సంస్థలు పూర్తిస్థాయి రిఫండ్ ఇవ్వాల్సిందేనంటూ కోర్టుకు తెలియజేసింది.
విమానయాన సంస్థలు కనుక రిఫండ్ ఇవ్వకుంటే వచ్చే ఏడాది మార్చి 31 వరకు అదే టికెట్‌పై మరోమారు ప్రయాణించే అవకాశం (క్రెడిట్ షెల్) లభిస్తుందని వివరించింది. ఆలోపు క్రెడిట్ షెల్ వినియోగించుకోని ప్రయాణికులకు పూర్తిస్థాయి రిఫండ్ ఇస్తుందని అత్యున్నత ధర్మాసనానికి కేంద్రం తెలిపింది.
లాక్‌డౌన్ సమయంలో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తమకు నచ్చిన రూట్‌లో మరోసారి ప్రయాణించవచ్చని, అవసరమనుకుంటే ఆ టికెట్‌ను వేరేవారికి కూడా బదిలీ చేసే అవకాశం ఉంటుందని పేర్కొంది. అయితే, ఈ ఏడాది మార్చి 25 నుంచి మే 3 మధ్య దేశీయ, అంతర్జాతీయ టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ సౌలభ్యం ఉండనున్నట్టు వివరించింది.