Russia: కరోనా వ్యాక్సిన్ సమగ్ర సమాచారాన్ని భారత్ కు అందజేసిన రష్యా!
- రష్యాలో తొలి రెండు దశల ప్రయోగాలు విజయవంతం
- భారత్ లోనే మూడో దశ ప్రయోగాలు చేసే చాన్స్
- స్పుత్నిక్-వితో శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి
కరోనాతో తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయిన ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న నేపథ్యంలో రష్యా స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. దీని ప్రయోగాల కోసం ఇప్పటికే ఆ దేశం.. భారత్ సాయాన్ని కోరింది.
ఈ క్రమంలో ఇప్పటికే తొలి రెండు దశల ప్రయోగాల సమగ్ర సమాచారాన్ని భారత్‌కు రష్యా అందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మన నిపుణులు దీనిని విశ్లేషిస్తున్నారు. ఒకవేళ వ్యాక్సిన్ సమర్థత బాగానే ఉందని, ప్రయోగాలు చేయొచ్చని భారత్ నిపుణులు ఆమోదం తెలిపితే మూడో దశ ప్రయోగాలు భారత్‌లోనూ జరిగే అవకాశాలున్నాయి.
ఈ వ్యాక్సిన్ ప్రయోగాలను సౌదీ అరేబియా, బ్రెజిల్, ఫిలిప్పైన్స్‌లోనూ చేయనున్నారు. కాగా, రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌తో శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నట్లు లాన్సెట్ ప్రచురించడంతో దీనిపై అంతర్జాతీయంగా ఆశలు నెలకొన్నాయి. ఈ వ్యాక్సిన్‌ను రిజిస్టర్ చేస్తున్నట్లు గత నెల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ప్రకటించారు.