AP High Court: ఏపీ 'ఎస్ఈసీ'పై సీఐడీ నమోదు చేసిన కేసుపై హైకోర్టులో విచారణ
- క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్
- విచారణ నిలిపివేయాలంటూ సీఐడీని ఆదేశించిన కోర్టు
- తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా
ఏపీ ఎన్నికల కమిషన్ అంశంలో సీఐడీ నమోదు చేసిన కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల సంఘం ఉద్యోగులను విధులు నిర్వర్తించనివ్వకుండా సీఐడీ కేసులు నమోదు చేసిందని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అటు, ఎస్ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి కూడా సీఐడీ అధికారులపై హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరారు. నిమ్మగడ్డ రమేశ్, సాంబమూర్తిల పిటిషన్లను కలిపి విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.
ఆపై, విచారణ చేపట్టిన హైకోర్టు... సీఐడీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విచారణ ప్రక్రియలో ముందుకు వెళ్లొద్దని ఆదేశించింది. ఈ కేసులో విచారణ ఎవరిపై, ఎందుకు చేస్తున్నారో వివరాలు తెలపాలని పేర్కొంది. ఈ కేసులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేంతవరకు తదుపరి చర్యలు నిలిపివేయాలని సీఐడీకి స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.