Tiger: రాయల్ బెంగాల్ టైగర్ ను చంపేసిన అడవిపంది... తాను కూడా మృతి!
- కజిరంగా అభయారణ్యంలో అరుదైన ఘటన
- తీవ్ర గాయాలతో మరణించిన రెండు జంతువులు
- ఆశ్చర్యపోయిన అటవీశాఖ అధికారులు
సాధారణంగా పెద్దపులి పంజాకు ఎలాంటి జంతువైనా బలవ్వాల్సిందే. కానీ ఓ అడవిపంది మాత్రం రాయల్ బెంగాల్ టైగర్ కు తన కోరల పదును రుచిచూపించింది. ఈ పోరులో పులి చనిపోవడం విశేషం. అయితే గాయాల తీవ్రతతో అడవిపంది కూడా కన్నుమూసింది. ఈ అరుదైన ఘటనకు అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్ అభయారణ్యం వేదికగా నిలిచింది.
ఇక్కడి పెద్ద పులుల అభయారణ్యంలోని కోహోరా ఫారెస్ట్ రేంజి పరిధిలో రెండు జంతువుల కళేబరాలను అధికారులు గుర్తించారు. వాటిలో ఒకటి రాయల్ బెంగాల్ టైగర్ కాగా, మరొకటి అడవిపంది. దీనిపై అధికారులు వ్యాఖ్యానిస్తూ, ఓ పోరాటంలో పులి, అడవిపంది రెండూ చనిపోవడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. పెద్దపులి ఉదర భాగంలో తీవ్ర గాయాలు కనిపించాయని, అడవిపంది ఒంటినిండా గాయాలేనని కజిరంగా పార్క్ రీసెర్చ్ ఆఫీసర్ రాబిన్ సర్మా తెలిపారు. తీవ్ర గాయాల కారణంగా ఈ రెండు జంతువులు తాము పోరాడిన స్థలం నుంచి కదల్లేకపోయి ఉంటాయని వివరించారు.
కాగా, ఈ రెండు వన్యమృగాలకు పోస్టుమార్టం జరిపిన స్థానిక పశువైద్యులు, నమూనాలను గౌహతి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.