China: పాకిస్థాన్ ను సైనిక స్థావరంగా వాడుకుంటున్న చైనా... అమెరికా నివేదికలో వెల్లడి
- వార్షిక నివేదికను కాంగ్రెస్ కు సమర్పించిన అమెరికా రక్షణశాఖ
- అనేక దేశాల్లో స్థావరాల ఏర్పాటుకు చైనా చర్యలు
- ఇంధన రవాణాకు అడ్డంకులు లేకుండా చూసుకుంటోందని వెల్లడి
అమెరికా రక్షణ శాఖ తన వార్షిక నివేదికను తాజాగా కాంగ్రెస్ ముందుంచింది. ఈ నివేదికలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. చైనా తన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కోసం అనేక దేశాలను స్థావరాలుగా వాడుకునే ప్రయత్నాలు చేస్తోందని, అలాంటి దేశాల్లో పాకిస్థాన్ కూడా ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు. సుదూర విదేశీ ప్రాంతాల్లోనూ తన సైన్యానికి స్థిరమైన వసతులు ఏర్పాటు చేసేందుకు చైనా భారీ చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
"ఆఫ్రికా దేశం జిబూటీలోని ప్రస్తుత స్థావరం మాత్రమే కాకుండా, మరికొన్ని దేశాల్లోనూ అదనపు సైనిక వసతులు ఏర్పాటు చేసుకోవడం ద్వారా తన పదాతి, నావికా, వాయుసేనలకు దన్నుగా నిలిచే చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు మయన్మార్, థాయ్ లాండ్, సింగపూర్, ఇండోనేషియా, పాకిస్థాన్, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెన్యా, సీషెల్స్, టాంజానియా, అంగోలా, తజికిస్థాన్ దేశాల్లో స్థావరాల అభివృద్ధిపై చైనా కన్నేసింది" అని వివరించారు.
అంతేగాకుండా, వన్ బెల్ట్ వన్ రోడ్ (ఓబీఓఆర్) ప్రాజెక్టులో భాగంగా పాకిస్థాన్ లో పైప్ లైన్లు, పోర్టు నిర్మాణంతో చైనా తన పట్టు మరింత పెంచుకుంటోందని, తద్వారా మలక్కా జలసంధి వంటి కీలక మార్గాల ద్వారా ఇంధన వనరుల రవాణాలో అడ్డంకులు లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తోందని అమెరికా రక్షణ శాఖ తన నివేదికలో పేర్కొంది. ఇప్పటికే చైనాకు చెందిన స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్సెస్ (ఎస్ఎస్ఎఫ్) నమీబియా, పాకిస్థాన్, అర్జెంటీనా వంటి దేశాల్లో ట్రాకింగ్, టెలీమెట్రీ, కమాండ్ స్టేషన్లను నిర్వహిస్తోందని వెల్లడించింది.