India: అర్ధరాత్రి భారత్-చైనా దళాల మధ్య కాల్పులు.. ఉద్రిక్తత
- లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఘటన
- భారతే మొదట కాల్పులు జరిపిందన్న చైనా ఆర్మీ
- పాంగాంగ్ లేక్ ప్రాంతంలోకి అక్రమంగా చొచ్చుకొచ్చిందని ఆరోపణ
భారత్, చైనా మధ్య గల్వాన్ లోయలో ఇటీవల జరిగిన ఘర్షణల ఉద్రిక్తత తగ్గకముందే మరోమారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా బలగాల మధ్య గత అర్ధరాత్రి కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.
భారతే మొదట కాల్పులు జరిపిందని, దీంతో తాము ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. భారత్ ఆర్మీ వాస్తవాధీన రేఖ దాటి పాంగాంగ్ లేక్, షెన్పావో పర్వత ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించిందని ఆరోపించారు. దీంతో తాము ప్రతిచర్యలు చేపట్టాల్సి వచ్చిందని వివరించారు. ఈ ఘటనపై భారత్ వైపు నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు.