Telangana: అక్షరాస్యతలో మళ్లీ అగ్రస్థానంలో కేరళ.. అట్టడుగున ఆంధ్రప్రదేశ్!
- 96.2 అక్షరాస్యతతో కేరళ అగ్రస్థానం
- 66.4 శాతంతో ఆఖరిస్థానంలో ఆంధ్రప్రదేశ్
- 72.8 శాతంతో కింది నుంచి నాలుగో స్థానంలో తెలంగాణ
‘హౌస్‌హోల్డ్ సోషల్ కన్సంప్షన్: ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా’ అనే అంశంపై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ నిర్వహించిన ‘జాతీయ నమూనా సర్వే’లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 2017-18 మధ్య ఈ సర్వే నిర్వహించారు. అక్షరాస్యతలో కేరళ ఎప్పటిలానే అగ్రస్థానంలో నిలిచింది. 96.2 శాతం అక్షరాస్యతతో దేశంలోనే అగ్రస్థానంలో నిలవగా, 66.4 శాతంతో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున నిలిచింది.
ఏపీలో పురుషుల అక్షరాస్యత రేటు 73.4 శాతంగా ఉండగా, మహిళల్లో 59.5 శాతంగా ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏడేళ్ల వయసు దాటిన వారిలో అక్షరాస్యత రేటుపై నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను సమర్పించింది. దీని ప్రకారం దేశంలో అక్షరాస్యత రేటు 77.7 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 73.5 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత శాతం 87.7 శాతంగా ఉంది.
అక్షరాస్యత విషయంలో కేరళ తర్వాత ఢిల్లీ 88.7 శాతంతో రెండో స్థానంలో నిలవగా, 87.6 శాతంతో ఉత్తరాఖండ్, 86.6 శాతంతో హిమాచల్ ప్రదేశ్, 85.9 శాతంతో అసోం వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 66.4 శాతంతో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున నిలవగా, 72.8 శాతంతో తెలంగాణ కింది నుంచి నాలుగో స్థానంలో నిలిచింది.
ఇక 69.7 శాతంతో రాజస్థాన్ కింది నుంచి రెండో స్థానంలో నిలవగా, 70.9 శాతంతో బీహార్ మూడో స్థానంలో, 73 శాతంతో ఉత్తరప్రదేశ్, 73.7 శాతంతో మధ్యప్రదేశ్‌లు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఇక, పురుషుల్లో అక్షరాస్యత 84.7 శాతంగా ఉండగా, మహిళల్లో అది 70. 3 శాతంగా ఉంది. కేరళ పురుషుల్లో అక్షరాస్యత 97.4 శాతంగా ఉండగా, మహిళల్లో అది 95.2 శాతంగా ఉంది. జాతీయ సగటు చూసుకుంటే పురుషుల్లో అక్షరాస్యత రేటు 84.7 శాతంగా ఉండగా, మహిళల్లో అది 70.3 శాతంగా ఉంది.