Russia: రష్యా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-వి’కి భారత్‌లో మూడో దశ పరీక్షలు
- ఈ నెలలోనే పరీక్షలు ప్రారంభం
- నవంబరు నాటికి ఫలితాలు
- టీకా సమర్థతపై అనుమానాలు వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ
రష్యా కరోనా టీకా ‘స్పుత్నిక్ వి’కి భారత్‌లో మూడో దశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెలలోనే పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతుండగా, వాటి ఫలితాలు మాత్రం నవంబరులో రానున్నట్టు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సీఈవో క్రిల్ ద్మిత్రియేవ్ సోమవారం తెలిపారు. భారత్‌తోపాటు సౌదీ అరేబియా, యూఏఈ, ఫిలిప్పీన్స్, బ్రెజిల్ వంటి దేశాల్లోనూ స్పుత్నిక్ వికి మూడో దశ పరీక్షలు నిర్వహించనున్నారు.
అందరి కంటే ముందుగా వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేసి, రష్యా సంచలనం సృష్టించిన సంగతి విదితమే. అయితే, ఈ వ్యాక్సిన్ సమర్థతపై ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు పలు దేశాలు పెదవి విరిచాయి. పూర్తిస్థాయిలో క్లినికల్ పరీక్షలు నిర్వహించకుండానే ఆదరాబాదరాగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
మరోవైపు, రష్యా వ్యాక్సిన్‌పై పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. అందులో భారత్ కూడా ఒకటి. రష్యా ప్రభుత్వంతో భారత్‌లోని ఫార్మా కంపెనీలు ఇప్పటికే చర్చలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ‘స్పుత్నిక్ వి’కి మూడో దశ పరీక్షలు భారత్‌లో కూడా నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.