Donald Trump: ఆలోగా అమెరికాలో వ్యాక్సిన్ పంపిణీ: డొనాల్డ్ ట్రంప్
- కొత్త వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు ఏళ్ల తరబడి ప్రక్రియ
- ఐతే కరోనా వ్యాక్సిన్ కోసం వేగంగా చర్యలు
- వందల బిలియన్ డాలర్ల ఖర్చుచేశాం
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కు టీకాను అభివృద్ధి చేయడానికి ప్రపంచ దేశాలు కృషిచేస్తున్నాయి. ఈ రేసులో ముందున్న అమెరికా నుంచి త్వరలోనే వ్యాక్సిన్ వస్తుందని ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అంతత్వరగా వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని పలువురు చెప్పారు.
దీనిపై మరోసారి ట్రంప్ స్పందిస్తూ... కొత్త వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు సాధారణంగా సంవత్సరాల తరబడి ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. తమ ప్రభుత్వం వందల బిలియన్ డాలర్లు ఖర్చుచేసి వ్యాక్సిన్ అభివృద్ధి చేసే యత్నాలను వేగవంతం చేసిందని చెప్పారు. అక్టోబర్ నాటికి వ్యాక్సిన్ సిద్ధం అవుతుందని మరోసారి చెప్పారు.
వచ్చే ఏడాది జనవరి నాటికి అమెరికాలో వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు 300 మిలియన్ల డోసులను సిద్ధం చేసేందుకు 'ఆపరేషన్ వార్ప్ స్పీడ్'' పేరుతో అమెరికా ఓ కార్యక్రమం ప్రారంభించిందని వివరించారు. కాగా, అక్టోబర్ కల్లా వ్యాక్సిన్ ను తీసుకొస్తామని ఇటీవల ట్రంప్ ప్రకటించగా, అది అసాధ్యమని ఆ దేశ అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటొనీ ఫౌచీ, డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలా హారిస్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.