jinping: కొవిడ్ విషయంలో పారదర్శకంగానే వ్యవహరించాం: సమర్థించుకున్న జిన్ పింగ్
- ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను కాపాడేందుకు కృషి
- కరోనా వ్యాప్తి తర్వాత వృద్ధిరేటు పొందిన దేశం చైనా
- మా దేశ శక్తి సామర్థ్యాలకు ఇది ఒక నిదర్శనం
కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాపై ప్రపంచ దేశాలు విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ ను తమ దేశంలో వూహాన్ దాటనివ్వకుండా చేసిన చైనా... ప్రపంచ దేశాలకు మాత్రం ఎలా వెళ్లనిచ్చిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే.
అయితే, కొవిడ్ విషయంలో తమ దేశం పారదర్శకంగానే వ్యవహరించిందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చెప్పుకొచ్చారు. ఆ వైరస్‌పై పోరాట సమయంలో గొప్ప పాత్ర పోషించిన వారి కోసం బీజింగ్‌లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో జిన్ పింగ్ మాట్లాడుతూ... కొవిడ్-19 వైరస్ విషయంలో తమ దేశం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను కాపాడేందుకు కృషి చేసిందని చెప్పారు.
కరోనా సంక్షోభ సమయంలో మొదట సానుకూల వృద్ధిరేటు పొందిన ప్రధాన ఆర్థిక వ్యవస్థ కూడా తమదేనని ఆయన చెప్పుకొచ్చారు. తమ దేశ శక్తి సామర్థ్యాలకు ఇది ఒక నిదర్శనమని తెలిపారు.