Bharataratna: పీవీ నరసింహారావుకు 'భారతరత్న' ప్రకటించాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం
- అసెంబ్లీలో పీవీని కీర్తించిన సీఎం కేసీఆర్
- తెలంగాణ బిడ్డ అంటూ వ్యాఖ్యలు
- హైదరాబాద్ వర్సిటీకి పీవీ పేరుపెట్టాలని వినతి
- పార్లమెంటులో విగ్రహ ప్రతిష్టాపన చేయాలని విజ్ఞప్తి
స్థితప్రజ్ఞుడు అనే పదానికి పర్యాయపదం అనేంతగా గుర్తింపు తెచ్చుకున్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' ప్రకటించాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారతదేశం పురోగమించడానికి మూలకారకుడు పీవీ నరసింహారావేనని, నేడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా భారతదేశం నిలిచేందుకు పీవీ సంస్కరణలే కారణమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
పీవీ తెలంగాణ బిడ్డ అని, దక్షిణాది నుంచి తొలిసారి ప్రధానమంత్రి పదవి చేపట్టిన రాజనీతజ్ఞుడు అని వివరించారు. దేశ ప్రగతికి ఉజ్వలమైన బాటలు వేసిన మహన్నోత దార్శనికుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావుకు మరణానంతరం 'భారతరత్న' ఇవ్వాలని, ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆ ప్రకటన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిందని సీఎం కేసీఆర్ తెలిపారు.
అంతేకాకుండా, పార్లమెంటు ప్రాంగణంలో ఆ మహనీయుని విగ్రహాన్ని, చిత్తరువును ప్రతిష్టించాలని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ నరసింహారావు పేరుపెట్టాలని కోరుకుంటున్నట్టు వివరించారు.