Pawan Kalyan: మొన్న పిఠాపురం, కొండబిట్రగుంట... ఇవాళ అంతర్వేది!... ఇవన్నీ యాదృచ్ఛికం కాదు: పవన్ కల్యాణ్
- అంతర్వేది ఘటనపై పవన్ స్పందన
- పిచ్చివాడి పని అంటున్నారని పవన్ వ్యాఖ్యలు
- ఈ కారణాలు వింటే పిల్లలు కూడా నవ్వుతారని వెల్లడి
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం మంటల్లో కాలిపోవడంపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఇదో పిచ్చివాడు చేసిన పని అని, తేనె పట్టు కోసం మంట పెడితే రథం కాలిపోయిందని చెబుతున్నారని, ఈ కారణాలు వింటే పిల్లలు కూడా నవ్వుతారని అన్నారు. మొన్న పిఠాపురం, కొండబిట్రగుంట... నేడు అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన యాదృచ్ఛికం కాదని స్పష్టం చేశారు. ఎన్ని ఘటనలు ఇలా యాదృచ్ఛికంగా జరుగుతాయని పవన్ ప్రశ్నించారు.
పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం ఘటన జరిగిన సమయంలోనే ప్రభుత్వం సరిగా స్పందించి ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యేవి కావని అభిప్రాయపడ్డారు. ఇది ఒకటో రెండు ఘటనలకే పరిమితమైతే మామూలుగా స్పందించి వదిలేసేవాడ్నని, కానీ వరుసగా ఇలాంటి ఘటనలే జరుగుతుంటే ఎంతమాత్రం మౌనంగా ఉండలేమని స్పష్టం చేశారు. హిందూ మతానికి సంబంధించి ఏదైనా మాట్లాడితే మతవాదులు అనే ముద్ర వేయడం బాల్యం నుంచి చూస్తున్నానని పవన్ పేర్కొన్నారు. రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు ఇచ్చిందని తెలిపారు.