Gunfire: ఒప్పందానికి తూట్లు పొడుస్తూ సరిహద్దుల్లో కాల్పులు జరిపిన చైనా... ఆపై ఘర్షణ!
- సరిహద్దుల్లో కొనసాగుతున్న చైనా దురుసుతనం
- సోమవారం రాత్రి భారత బలగాలపై కాల్పులు
- తిప్పికొట్టిన భారత జవాన్లు
ఓ వైపు సైనిక అధికారుల స్థాయిలో సరిహద్దు సమస్యలపై చర్చలు జరుగుతుండగానే చైనా బలగాలు ఘోర తప్పిదానికి పాల్పడ్డాయి. దాదాపు 45 ఏళ్ల తర్వాత సరిహద్దుల్లో చైనా బలగాలు కాల్పులు జరిపాయి. 1975 తర్వాత చైనా బలగాలు సరిహద్దుల్లో భారత బలగాలపై కాల్పులు జరపడం ఇదే ప్రథమం. 1996లో కాల్పులు జరపకూడదన్న ఒప్పందం కుదిరింది. అప్పటినుంచి భారత్ ఎంతో సంయమనం పాటిస్తుండగా, చైనా మాత్రం ఆ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ సోమవారం రాత్రి ఎల్ఏసీ వెంబడి కాల్పులు జరిపింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారత జవాన్లు కూడా కాల్పులు జరిపారు.
తాజాగా, రెజాంగ్లా హైట్స్ వద్ద భారత్ దళాలపై చైనా సైనికులు దాడికి దిగారు. పర్వతప్రాంతంపై మోహరించి ఉన్న భారత దళాలను తరిమివేసే ఉద్దేశంతో ముందుకొచ్చిన చైనా బలగాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటనను భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో జరగనున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ ఘటనపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.