JSCA: ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ కు రూ.1800 బాకీపడ్డ ధోనీ.. తాము కడతామన్న అభిమానులు!
- ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ లో ధోనీకి జీవితకాల సభ్యత్వం
- సభ్యత్వ రుసుమును కట్టని ధోనీ
- అసోసియేషన్ ప్రకటనతో తీవ్ర దుమారం
- చందాలేసుకున్న డబ్బును తీసుకోబోమని అసోసియేషన్ వెల్లడి
ఝార్ఖండ్ రాష్ట్రం నుంచి టీమిండియాకు ఎన్నికైన తొలి క్రికెటర్ గా నిలిచి, ఆపై విజయవంతమైన కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, జేఎస్సీఏ (ఝార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్)కు బాకీ పడ్డాడు. అసోసియేషన్ కు కట్టాల్సిన రూ.1800 ఇంతవరకు కట్టలేదట. జేఎస్సీఏ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించగా, జంషెడ్ పూర్ లో తొలుత గందరగోళం, ఆపై వివాదం నెలకొన్నాయి.
ఆ వెంటనే మాజీ క్రికెటర్ శేష్ నాథ్ పాఠక్, కొందరు విద్యార్థులు, అభిమానులు చందాలు వేసుకుని, డబ్బు సేకరించి అసోసియేషన్ కు ఇచ్చేందుకు ప్రయత్నించగా, ఆ డబ్బు తీసుకునేందుకు అసోసియేషన్ అంగీకరించలేదు.
ఈ ఘటన వెనుక మరిన్ని వివరాల్లోకి వెళితే, గత సంవత్సరం ధోనీకి జేఎస్సీఏ జీవితకాల సభ్యత్వాన్ని ఇచ్చింది. సభ్యత్వ రుసుముగా ధోనీ రూ. 1,800 చెల్లించాల్సి వుండగా, దాన్ని ఇంతవరకూ చెల్లించలేదు. ధోనీ ఇంకా సభ్యత్వ రుసుము చెల్లించలేదని అసోసియేషన్ ప్రకటించింది. తాము చందాలు వేసుకుని ఇచ్చిన డబ్బును తీసుకోని అసోసియేషన్, డ్రాఫ్ట్ తీసి, పోస్టు ద్వారా పంపాలని సూచించిందని శేష్ నాథ్ పాఠక్ మీడియాకు తెలిపారు.
కొందరు విద్యార్థులు, అభిమానులు చందాలు వేసుకుని డబ్బు సేకరించామని, భారత క్రికెట్ కు ఎంతో చేసిన ధోనీకి తమవంతుగా చేస్తున్న చిరు సాయం ఇదని పాఠక్ వ్యాఖ్యానించినా, అసోసియేషన్ ప్రకటన దుమారం రేపింది.
దీనిపై జేఎస్సీఏ సెక్రటరీ సంజయ్ సహాయ్ స్పందిస్తూ, ఇతరుల పేరిట డబ్బు చెల్లించాల్సి వస్తే, ఆ వ్యక్తి అంగీకారం తప్పనిసరని స్పష్టం చేశారు. తాను బకాయి పడిన డబ్బును కట్టాలని ధోనీ వీరికి చెప్పుంటే, ఆ డబ్బు తీసుకుని ఉండేవారమని అన్నారు. ధోనీ నుంచి వీరికి అనుమతి లేదని, అందువల్లే డ్రాఫ్ట్ తీసుకునేందుకు నిరాకరించామని వ్యాఖ్యానించడం గమనార్హం.