Rhea Chakraborty: రియా చక్రవర్తి జైలుకు తరలింపు.. నేరం నిరూపితమైతే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష!
- రియా బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు
- డ్రగ్స్ సిండికేట్ లో రియా కీలక సభ్యురాలు అన్న ఎన్సీబీ
- ముంబైలోని బైకుల్లా జైలుకు తరలింపు
బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తిని ముంబైలోని బైకుల్లా జైలుకు తరలించారు. డ్రగ్స్ వ్యవహారంలో ఆమెను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను ఈ ఉదయం జైలుకు తరలించారు. మరోవైపు, ముంబైలోని ఓ సెషన్స్ కోర్టులో ఆమె ఈరోజు మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి ఆమె నార్కోటిక్స్ కంట్రోల్ బ్యురో కార్యాలయంలోనే గడిపారు.
కోర్టులో రియాకు బెయిల్ ఇవ్వకూడదని ఎన్సీబీ వాదించింది. కోర్టుకు అందజేసిన నివేదికలో రియాపై తీవ్ర అభియోగాలను మోపింది. డ్రగ్స్ సిండికేట్ లో రియా కీలక సభ్యురాలు అని తెలిపింది. ప్రతి డ్రగ్ డెలివరీ, పేమెంట్ వివరాలు ఆమెకు తెలుసని చెప్పింది. శామ్యూల్ మిరండా, దీపేశ్ సావంత్ కూడా సుశాంత్ కు డ్రగ్స్ సరఫరా చేసేవారని... వాటికి సుశాంత్, రియా ఇద్దరూ డబ్బులు చెల్లించేవారని వారిద్దరూ వెల్లడించారని తెలిపింది. మరోవైపు ఈ ఆరోపణలు నిరూపితమైతే చట్టం ప్రకారం రియాకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.