Donald Trump: కమలా హ్యారిస్‌పై మరోసారి మండిపడ్డ డొనాల్డ్ ట్రంప్!
- ఆమెను అమెరికా ప్రజలు ఇష్టపడరు
- ఉపాధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేయడం ఆసక్తికరం
- ప్రపంచపు గొప్ప ఆర్థిక వ్యవస్థగా యూఎస్
- చైనా వైరస్ కరోనా వల్ల ప్రతికూల పరిస్థితులు
అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌పై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆమెను అమెరికా ప్రజలు ఇష్టపడబోరని ఆయన వ్యాఖ్యానించారు. ఆమె అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్నప్పటికీ, పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఆమెను ఉపాధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేయడం ఆసక్తికరమైన విషయమని ఆయన వ్యాఖ్యానించారు.
ఒకవేళ ఆమె అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పటికీ ఆమె అమెరికాకు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు అయ్యే ఛాన్స్ లేదని చెప్పుకొచ్చారు. దురదృష్టవశాత్తూ ఆమె అమెరికా అధ్యక్షురాలైతే దేశానికే అవమానమని అన్నారు.
ఇదే సమయంలో, చైనాపై ట్రంప్ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రపంచ గొప్ప ఆర్థిక వ్యవస్థగా యూఎస్ ను నిర్మించామని చెప్పిన ఆయన... చైనా వైరస్ కరోనా వల్ల ఇప్పుడు తమ ఆర్థిక వ్యవస్థకు ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయని చెప్పారు. జో బైడెన్ గెలిస్తే చైనా గెలిచినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన విధానాల వల్ల అమెరికా దిగజారిపోతుందని డ్రాగన్ దేశానికి తెలుసని చెప్పారు.