antharvedi: అంతర్వేదిలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. పోలీసుల బందోబస్తు పెంపు!
- ఇటీవల రథం దగ్ధం
- హిందూ సంఘాల మండిపాటు
- 43 మంది నేతలపై పోలీసు కేసులు
- నాయకులకు అనుమతి లేదంటోన్న పోలీసులు
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం రథం ఇటీవల అగ్నికి ఆహుతైన ఘటనపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఆ ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ తదితర సంఘాల కార్యకర్తలు ఆందోళనలకు కూడా దిగిన విషయం తెలిసిందే. అక్కడ ఇప్పటికీ ఉద్రిక్తత కొనసాగుతోంది.
రథం కాలిపోయిన నేపథ్యంలో ఈ రోజు ఛలో అంతర్వేదికి బీజేపీ-జనసేన పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఆ ప్రాంతంలో పోలీసులతో భద్రతను పెంచారు. కోనసీమ వ్యాప్తంగా బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
కొత్తపేటలో బీజేపీ నేత పాలూరు సత్యానందం, రావులపాలెంలో రామకృష్ణారెడ్డిలను గృహనిర్బంధం చేశారు. అలాగే, నిన్న చలో అంతర్వేదిలో పాల్గొన్న 43 మంది నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అంతర్వేదిలో పోలీసులు భారీగా మోహరించారు. ఇతర ప్రాంతాల వారిని అక్కడకు రానివ్వట్లేదు.
30వ పోలీసు యాక్టు అమలు కారణంగా అక్కడ పర్యటించేందుకు నాయకులకు అనుమతి లేదని తెలిపారు. కాగా, నిన్న పలువురు మంత్రులు ఆ ప్రాంతంలో పర్యటించేందుకు వెళ్లగా హిందూ సంఘాల కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో వారు అక్కడి నుంచి వెనుదిరిగిన విషయం తెలిసిందే. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం రథం తగలబడిన ఘటన వెనుక పలువురి హస్తం ఉందని ఆరోపణలు వస్తుండడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.