Nara Lokesh: ఈ స్కాంలో కనీసం 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జైలుకు వెళతారు గురూ!: మీడియాతో నారా లోకేశ్
- వైసీపీ సర్కారుపై లోకేశ్ ధ్వజం
- అంతర్వేది ఘటనపై వదిలిపెట్టేది లేదని స్పష్టీకరణ
- వైసీపీ వాళ్లకు చంద్రబాబే గుర్తుకు వస్తున్నారని వ్యాఖ్యలు
- వైసీపీ నేతలకు ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరిందన్న లోకేశ్
వైసీపీ నేతలకు వడ్డీతో సహా చెల్లిస్తామని, తమపై బురద చల్లితే సహించబోమని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఉద్ఘాటించారు. ఈ మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజల మధ్య మత సామరస్యం కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. నెల్లూరు జిల్లాలో ఇంతకుముందు ఓ రథం దగ్ధం చేశారని, ఇవాళ అంతర్వేదిలోనూ అదే ఘటన జరిగిందని తెలిపారు. గుంటూరు జిల్లాలో ఆలయంలో తల దువ్వుకోవద్దని చెప్పినందుకు అర్చకుడ్ని అన్యాయంగా చితకబాదారని వెల్లడించారు. దాడి చేసిన వ్యక్తి వైసీపీకి చెందినవాడని తెలిపారు.
అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ జరగాల్సిందేనని, రాబోయే రోజుల్లో తాము దీనిపై పోరాడతామని స్పష్టం చేశారు. హైదరాబాదులో కూర్చుని చంద్రబాబు ఈ ఘటనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ మంత్రి వెల్లంపల్లి ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై మీ సమాధానం ఏంటని ఓ మీడియా ప్రతినిధి అడగడంతో లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ఇవి చేతకాని మాటలని లోకేశ్ దీటుగా బదులిచ్చారు. రాష్ట్రంలో రథం దగ్ధం కావడం ఇది రెండో ఘటన అని తెలిపారు. వీళ్లకు ప్రతిదానికి చంద్రబాబే గుర్తుకు వస్తున్నారని, వారికి కలలో కూడా చంద్రబాబే గుర్తొస్తున్నారని, వారికి జగన్ రెడ్డి గుర్తుకు రావడంలేదని విమర్శించారు.
"నెల్లూరులో రథం కాలిపోయిందంటే ప్రమాదవశాత్తు జరిగిందనుకున్నాం. కానీ అదే ఘటన మళ్లీ జరిగింది. ప్రభుత్వం ఏంచేస్తోంది? విపక్ష నేతలు ప్రశ్నిస్తుంటే మీరు ఎందుకు భయపడుతున్నారు?" అంటూ వ్యాఖ్యానించారు. శాసన రాజధానిని కూడా అమరావతి నుంచి తరలిస్తామని ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలపై లోకేశ్ తన గళం వినిపించారు. ఆ మంత్రికి ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు వెళ్లిందని, సన్నబియ్యం ఇస్తాం, ఇస్తాం, ఇస్తాం అంటూ ఇవ్వలేకపోవడంతో ఆయనకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయిందని, దాంతో ఏం మాట్లాడుతున్నాడో అతనికే అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారు. అతనొక్కడికే కాదని అందరు వైసీపీ మంత్రులకు ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరినట్టుందని, సీఎం జగన్ కంటే చంద్రబాబు పేరే ఎక్కువగా తలుచుకుంటున్నారని అన్నారు.
ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి నారా లోకేశ్ ను ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశంపై వివరణ అడిగారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టుల్లో కేసులు వేస్తూ టీడీపీ అడ్డుపడుతోందని అంటున్నారని ఆ ప్రతినిధి అడిగారు. దీనికి లోకేశ్ స్పందిస్తూ... "భూముల విషయంలో తమ హక్కులు కాపాడాలంటూ ప్రజలు కోర్టుకు వెళ్లినా అది టీడీపీయే చేసిందంటున్నారు. మిగతా 80 శాతం ప్రజలకు ఎందుకు భూములు ఇవ్వడంలేదో మేం ప్రశ్నిస్తున్నాం. మిగతా చోట్ల కేసులు లేవు కదా... భూములు ఇవ్వడానికి మీకు అభ్యంతరం ఏంటి? రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కేసులు లేవు కదా... అక్కడ భూములు ఇచ్చుకోవచ్చు కదా!" అని పేర్కొన్నారు.
ఇళ్ల స్థలాలపై అవినీతి ఆరోపణలకు సంబంధించి తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, దీనిపై సీబీఐ ఎంక్వైరీ కూడా వేస్తామని చెబుతున్నారని అన్నారు. "ఈ ల్యాండ్ స్కాంలో కనీసం 40 మంది జైలుకు వెళ్లడం ఖాయం. పేద ప్రజల నుంచి దొడ్డిదారిన రూ.5 లక్షలకు భూమిని కొని, అదే భూమిని ప్రభుత్వానికి రూ.50 లక్షల నుంచి కోటి రూపాయలకు అమ్ముకుంటున్నారు. దీనిపై అన్నీ బయటపడతాయి... కనీసం 40 మంది జైలుకు వెళతారు గురూ! పేద ప్రజల జేబులు కొట్టినోడు ఎవరూ బయటలేరండీ! గ్యారంటీగా జైలుకు వెళతారు... ఎలాగూ అది జైలు పార్టీయే కదా. పార్టీ అధ్యక్షుడూ జైలే... పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా జైలే. ఎమ్మెల్యేలు మేం కూడా జైలుకు వెళ్లొస్తాం అంటున్నారు" అంటూ వ్యాఖ్యలు చేశారు.