Donald Trump: నన్ను మించిన పర్యావరణవేత్త లేడు: ట్రంప్
- పలు రాష్ట్రాల్లో ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ పై నిషేధం
- పర్యావరణ అంశాలను అజెండాలో చేర్చిన ట్రంప్
- ఎన్నికల స్టంట్ అంటున్న విమర్శకులు
నవంబరు 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రచారంలో అనేక అంశాలకు చోటిస్తున్నారు. తాజాగా పర్యావరణ అంశానికి కూడా తన అజెండాలో స్థానం కల్పించారు. అంతేకాదు, ఆ దిశగా కార్యాచరణకు కూడా ఉపక్రమించారు. సౌత్ కరోలినా, ఫ్లోరిడా, జార్జియా ప్రాంతాల్లో సముద్ర గర్భ తవ్వకాలపై తాత్కాలిక నిషేధం విధించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ, ఇప్పటికాలంలో తనను మించిన పర్యావరణవేత్త మరొకరు లేరని స్వయంగా అభివర్ణించుకున్నారు. గతంలో మాజీ అధ్యక్షుడు థియొడర్ రూజ్ వెల్ట్ గొప్ప పర్యావరణవేత్తగా గుర్తింపు పొందారని, ఆయన తర్వాత మళ్లీ అంతటి పేరు తనకే వచ్చిందని కొందరు సెనేటర్లు తనతో అన్నారని ట్రంప్ వెల్లడించారు. అయితే, ట్రంప్ విమర్శకులు మాత్రం ఇది ఎన్నికల కోసం వేస్తున్న ఎత్తుగడ అని ఆరోపిస్తున్నారు. పర్యావరణవేత్త అయితే పారిస్ ఒప్పందం నుంచి అమెరికా ఎందుకు బయటికి వచ్చినట్టు అని ప్రశ్నించారు.