Raghurama Krishnaraju: వర్చువల్ సమావేశం ఏర్పాటు చేయాలంటూ సీఎం జగన్ కు లేఖ రాసిన రఘురామకృష్ణరాజు

MP Raghurama Krishnaraju writes CM Jagan for virtual meeting before Parliament sessions
  • సెప్టెంబరు 14 నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
  • లేవనెత్తాల్సిన అంశాలపై అవగాహన కలిగించాలన్న రఘురామ
  • అన్ని పార్టీల సభ్యులను ఆహ్వానించాలని సూచన
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 14న ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఏపీకి చెందిన పార్లమెంటు సభ్యులు సభా సమావేశాల్లో ఏ అంశాలు ప్రస్తావించాలన్న దానిపై అవగాహన కల్పించాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం జగన్ ను కోరారు. వివిధ అంశాలపై ఏ విధంగా స్పందించాలి? ఏ అంశాలను లేవనెత్తాలి? అనే విషయాలపై సమగ్రంగా చర్చించేందుకు రాష్ట్ర పార్లమెంటు సభ్యులతో ఓ వర్చువల్ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రఘురామకృష్ణరాజు లేఖ రాశారు.

ఏపీ పార్లమెంటు సభ్యులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయాలని సూచించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి అనేక విషయాల్లో సహాయ సహకారం అందిస్తోందని, అయినప్పటికీ రాష్ట్రానికి చెందిన పలు అంశాలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలను సీఎం జగన్ పార్లమెంటు సభ్యులకు వివరించాలని తెలిపారు. ఆయా అంశాలను పార్లమెంటు సభ్యులకు ముందుగా తెలియజేయాలని, సభ్యుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.

ప్రతి పార్లమెంటు సమావేశాలకు ముందు సీఎంలు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయడం గతంలోనూ ఉందని, ఈ ఆనవాయితీని సీఎం జగన్ కూడా కొనసాగించాలని కోరుకుంటున్నామని రఘురామకృష్ణరాజు వివరించారు. ఈ వర్చువల్ సమావేశానికి రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులను ఆహ్వానించాలని, ఈ సమావేశం కంటే ముందు వైసీపీ పార్లమెంటు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు.
Raghurama Krishnaraju
Jagan
Letter
Virtual Meeting
Parliament Sessions
YSRCP
Andhra Pradesh

More Telugu News