Harbhajan Singh: అప్పు తీర్చడంలేదంటూ ఓ వ్యాపారవేత్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన క్రికెటర్ హర్భజన్ సింగ్
- మహేశ్ అనే వ్యక్తికి రూ.4 కోట్లు ఇచ్చానన్న హర్భజన్
- డబ్బు తిరిగి చెల్లించడంలేదని ఆరోపణ
- చెక్ బౌన్స్ అయిందని వెల్లడి
భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ చెన్నైకి చెందిన జి.మహేశ్ అనే వ్యాపారవేత్తపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జి. మహేశ్ తన నుంచి రూ.4 కోట్లు అప్పుగా తీసుకుని, తీర్చడం లేదంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మహేశ్ అనే ఆ వ్యాపారవేత్త ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జి.మహేశ్ తనకు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడని, 2015లో రూ.4 కోట్లు అప్పుగా ఇచ్చానని హర్భజన్ తన ఫిర్యాదులో వివరించాడు.
అయితే, అప్పు తీర్చమని ఎప్పుడు కోరినా మహేశ్ వాయిదాలు వేస్తూ వచ్చేవాడని, ఆగస్టు 18న రూ.25 లక్షలకు చెక్ ఇచ్చాడని, అయితే ఆ చెక్ బౌన్స్ అయిందని తెలిపాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ జట్టులో సభ్యుడైన హర్భజన్ కొన్నిరోజుల కిందటి వరకు చెన్నైలోనే ఉన్నాడు. ఈ సందర్భంగా భజ్జీ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
ఈ ఫిర్యాదును పోలీసు ఉన్నతాధికారులు ఏసీపీ విశ్వేశ్వరయ్యకు బదిలీ చేశారు. దాంతో తన ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా మహేశ్ కు ఏసీపీ నోటీసులు పంపారు. అరెస్ట్ చేస్తారన్న భయంతో మహేశ్ తన న్యాయవాది ద్వారా మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నాడు.