Yuvraj Singh: యువరాజ్ సింగ్ అభిమానులకు పండుగలాంటి వార్త.. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న యువీ

Yuvraj Singh confirms comeback plans

  • రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు బీసీసీఐకి లేఖ
  • పీసీఏ కార్యదర్శి పునీత్ బాలి కోరిక మేరకు నిర్ణయం వెనక్కి
  • నిర్ణయం తీసుకోవడానికి మూడు వారాలు పట్టిందన్న యువరాజ్

ఆస్ట్రేలియాలోని ప్రతిష్ఠాత్మక లీగ్ బిగ్‌బాష్‌పై టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ కన్నేశాడంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అతడి కోసం ఓ ఫ్రాంచైజీని వెతికే పనిలో క్రికెట్ ఆస్ట్రేలియా తలమునకలై ఉందని యువీ మేనేజర్ కూడా చెప్పాడు. దీంతో యువీ ఆటను మళ్లీ చూడొచ్చని అభిమానులు సంబరపడ్డారు. అయితే, ఇది వారికి అంతకుమించిన శుభవార్తే. గతేడాది ప్రకటించిన రిటైర్మెంటు నిర్ణయాన్ని యువీ వెనక్కి తీసుకున్నాడు.

పంజాబ్ క్రికెట్ సంఘం కార్యదర్శి పునీత్ బాలి కోరిక మేరకు గతేడాది ప్రకటించిన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు యువరాజ్ పేర్కొన్నాడు. నిజానికి రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి తొలుత ఆలోచించానని, బాలి విజ్ఞప్తితో కాదనలేకపోయానని అన్నాడు. మూడు నాలుగు వారాల పాటు బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రపంచకప్ హీరో చెప్పుకొచ్చాడు.

యువరాజ్ సింగ్ ఇప్పుడు పంజాబ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడనున్నాడని, పంజాబ్ క్రికెట్ సంఘం (పీసీఏ) అభ్యర్థన మేరకు మొహాలీ స్టేడియంలో రెండు సుదీర్ఘ శిబిరాలు కూడా నిర్వహించాడని పునీత్ బాలి తెలిపారు. యువీ ఆధ్వర్యంలో ఈ శిబిరంలో శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, అన్మోల్‌ప్రీత్ సింగ్ సాధన చేసినట్టు పేర్కొన్నారు. శిక్షణ సందర్భంగా యువరాజ్‌కు మళ్లీ ఆటపై మనసు మళ్లిందని, తాను రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు పేర్కొంటూ బీసీసీఐ చీఫ్ గంగూలీకి యువీ లేఖ రాశాడని బాలి వివరించారు.

  • Loading...

More Telugu News