Corona Virus: ఆగిపోయిన వ్యాక్సిన్ ట్రయల్స్ పై కీలక ప్రకటన చేసిన ఆస్ట్రాజెనికా సీఈఓ!
- నిన్న నిలిచిపోయిన వ్యాక్సిన్ ట్రయల్స్
- ఓ మహిళకు అనారోగ్య సమస్య వచ్చింది
- ఆమె కోలుకున్నారన్న ఆస్ట్రాజెనికా సీఈఓ పాస్కల్
ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్ ను నిలిపివేస్తున్నట్టు నిన్న వచ్చిన ప్రకటన తీవ్ర కలకలం రేపింది. వ్యాక్సిన్ డోస్ వేసుకున్న వాలంటీర్ కు తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చాయని, అందువల్ల లండన్ లో ట్రయల్స్ నిలిపివేస్తున్నామని ప్రకటించడంతో వ్యాక్సిన్ పై నీలినీడలు ఏర్పడ్డాయి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ ప్రారంభం కాగా, ఆస్ట్రాజెనికా సీఈఓ పాస్కల్ సోరియట్ స్పందించారు.
పలు దేశాల నుంచి ఆయన వివరణ కోరుతూ మీడియా నుంచి ప్రశ్నలు రాగా, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్ ఓ టెలీ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "వ్యాక్సిన్ ట్రయల్స్ లో పాల్గొన్న ఓ మహిళకు తీవ్రమైన నరాలకు సంబంధించిన అనారోగ్య సమస్య వచ్చింది. ఆమెకు ఏమైందన్న విషయంలో ఇంతవరకూ ఎటువంటి నిర్ధారణకు రాలేదు. కానీ ఆమె కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాబోతున్నారు. వ్యాక్సిన్ సురక్షిత చాలా ముఖ్యమన్న సంగతి మాకు తెలుసు. పూర్తి సురక్షితమని తేలితేనే వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేస్తాం" అని అన్నారు.
వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిలిపివేయడం ఇదే తొలిసారి కాదని, గత జూలైలో ఓ వాలంటీర్ కు కూడా ఇదే విధంగా నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చాయని, అప్పుడు కూడా ట్రయల్స్ ఆపామని, ఆపై వైద్యుల పరీక్షల్లో సదరు వాలంటీర్ కు వచ్చిన సమస్యలు వ్యాక్సిన్ వల్ల కాదని తేలిందని ఆయన స్పష్టం చేశారు.