Corona: కరోనా లక్షణాలుండి నెగటివ్ వస్తే... తిరిగి అందరికీ పరీక్షలు చేయాలంటూ కేంద్రం ఆదేశాలు!
- అన్ని రాష్ట్రాలు, యూటీలకు ఆదేశాలు
- ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ పాటించాల్సిందే
- ఏ ఒక్క లక్షణమున్నా మరోసారి టెస్ట్ చేయాల్సిందే
కరోనా కేసుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ర్యాపిడ్ యాంటీజన్ టెస్టులు చేయించుకుని, నెగటివ్ వచ్చినప్పటికీ, కరోనా లక్షణాలున్న అందరినీ మరోసారి పరీక్షించాలని, అందుకు విధిగా ఆర్టీ-పీసీఆర్ విధానాన్ని పాటించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. చాలా రాష్ట్రాల్లో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుల్లో నెగటివ్ వచ్చిన వారిని వదిలేశారని, వారిలో లక్షణాలున్న వారికి నిబంధనల ప్రకారం ఆర్టీ-పీసీఆర్ చేయలేదని తెలుస్తోందని కేంద్రం పేర్కొంది.
ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం, జ్వరం లేదా దగ్గు లేదా ఊపిరి ఇబ్బంది లక్షణాల్లో ఏదైనా ఉండి యాంటీజన్ టెస్టుల్లో నెగటివ్ వచ్చినా, రెండు నుంచి మూడు రోజుల్లోనే రీటెస్ట్ చేయాలని కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. లక్షణాలుండి నెగటివ్ వచ్చిన వారు వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారని, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుల్లో నూరు శాతం కచ్చితత్వం ఉండదని గుర్తు చేసింది. ఈ టెస్టుల్లో పాజిటివ్ వస్తే, వైరస్ సోకినట్టేనని, నెగటివ్ వస్తే ఆర్టీ-పీసీఆర్ తప్పనిసరని పేర్కొంది.