Bigg Boss: 'బిగ్ బాస్'లో గంగవ్వ 10 వారాలు ఖాయంగా ఉంటుంది... ఈ సంవత్సరం పోటీదారులు సరిగ్గా లేరన్న మాజీ విజేత కౌశల్!
- సెలబ్రిటీలంతా ఉపాధి వేటలో ఉన్నారు
- అందుకే హౌస్ లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు
- గంగవ్వతో పల్లెటూర్లలో బిగ్ బాస్ కు మరింత ఆదరణ
టాలీవుడ్ అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ లో ఈ సంవత్సరం కంటెస్టెంట్ల సెలక్షన్ అంత బాగా లేదని ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్లు వస్తుండగా, బిగ్ బాస్ రెండో సీజన్ లో విజేతగా నిలిచిన కౌశల్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కరోనా కారణంగా కొన్ని నెలల పాటు ఉపాధిని కోల్పోయిన సెలబ్రిటీలు, తిరిగి ఉపాధిని వెతుక్కునే పనిలో ఉన్నందునే హౌస్ లోకి వెళ్లేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తిని చూపకపోయి ఉండవచ్చని కౌశల్ వ్యాఖ్యానించారు.
హౌస్ లో ఉన్న పోటీదారుల ప్రతిభపై ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేమని, అయితే, ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, ఓ పల్లెటూరు నుంచి వచ్చిన బామ్మ గంగవ్వను ఎంపిక చేయడం మాత్రం ఓ అసాధారణ నిర్ణయమని, ఆమె కనీసం 10 వారాల పాటు హౌస్ లో కొనసాగుతారని భావిస్తున్నానని అన్నారు. పల్లెటూర్లలో ఈ షోను తిలకించే వారి సంఖ్యను పెంచాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని కౌశల్ అభిప్రాయపడ్డారు.
ఇక ఫిజికల్ టాస్క్ లలో గెలిస్తే, ఫైనల్ వరకూ రావచ్చని ఎవరూ భావించరాదని, తాను హౌస్ లో ఉన్న సమయంలో గీతామాధురి ఫిజికల్ టాస్క్ లలో సత్తా చూపకుండానే ఫైనల్ వరకూ వచ్చిందని చెప్పారు. ఇక ఈ సీజన్ లో సూర్యకిరణ్, ఏ విషయంలోనైనా తన మాటే సరైనదన్న విధంగా వాదనకు వస్తున్నాడని, అలా చేస్తే, టీవీలో ఎక్కువగా కనిపించవచ్చేమోగానీ, అన్ని వేళలా కాదని, సూర్యకిరణ్ తన ప్రవర్తనకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఈ సీజన్ లో సైతం కంటెస్టెంట్లకు అభిమానుల క్లబ్ లు మొదలయ్యాయని గుర్తు చేసిన కౌశల్, ఓ పోటీదారు కోసం కౌశల్ ఆర్మీ చేసిన ర్యాలీ మాత్రం 'నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్' అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఆ స్థాయిలో ఇప్పుడు ఎవరికీ బయట ఫ్యాన్స్ లేరని కౌశల్ చెప్పారు.