Rhea Chakraborty: బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించనున్న రియా!

Rhea Chakraborty mulls to move high court for bail

  • సెషన్స్ కోర్టులో రియా బెయిల్ పిటిషన్ తిరస్కరణ
  • ఇంతకుముందే రియా బెయిల్ కు నో చెప్పిన మేజిస్ట్రేట్ కోర్టు
  • తాను అమాయకురాలినంటున్న రియా

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై కేంద్రస్థాయి దర్యాప్తు సంస్థలు ముమ్మర దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తుండగా, ఈ మధ్యనే రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సుశాంత్ వ్యవహారంలో డ్రగ్స్ కోణాన్ని వెలికి తీస్తోంది. ఈ క్రమంలో ఎన్సీబీ అధికారులు సుశాంత్ గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి చుట్టూ ఉచ్చుబిగించారు.

సుశాంత్ కుటుంబ సభ్యులు రియాపైనే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎన్సీబీ ప్రధానంగా రియా కేంద్రబిందువుగా డ్రగ్స్ కోణంలో దర్యాప్తును వేగవంతం చేస్తోంది. ఇప్పటికే రియాను అరెస్ట్ చేసిన ఎన్సీబీ కోర్టు ముందు హాజరు పర్చగా ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించారు.

కాగా, రియాకు ఇప్పటికే రెండు కోర్టుల్లో బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. తొలుత మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించగా అక్కడ ఆమె బెయిల్ పిటిషన్ కొట్టివేశారు. తాజాగా సెషన్స్ కోర్టులోనూ అదే ఫలితం వచ్చింది. ఈ నేపథ్యంలో రియా బాంబే హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. దీనిపై రియా చక్రవర్తి న్యాయవాది సతీశ్ మానే షిండే మీడియాతో మాట్లాడుతూ, సెషన్స్ కోర్టు నిర్ణయంపై ఆర్డర్ కాపీ చేతికి వచ్చిన తర్వాత వచ్చేవారం బాంబే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

సుశాంత్ కోసం తాము డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఎన్సీబీ విచారణలో రియా అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి. అయితే తాను అమాయకురాలినని, తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని రియా సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ లో పేర్కొంది. అయితే కోర్టు ఆమె వాదనలను తోసిపుచ్చింది. రియానే కాదు, ఆమె సోదరుడు షోవిక్ కూడా ఈ వ్యవహారంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షోవిక్ కూడా రియాతో పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News