Dilip Ghosh: కరోనా ఎప్పుడో పోయింది... బెంగాల్ బీజేపీ చీఫ్ విచిత్ర వ్యాఖ్యలు
- పశ్చిమ బెంగాల్ లో మరింత ముదిరిన రాజకీయ పోరు
- తమను అడ్డుకునేందుకు మమతా వైరస్ ను వాడుకుంటోందన్న దిలీప్ ఘోష్
- బెంగాల్ లో రెండు లక్షల కరోనా కేసులు
పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ కు, బీజేపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా రాజకీయ పోరాటం జరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఓ సభలో మాట్లాడుతూ... కరోనా వైరస్ ఎప్పుడో పోయిందని, కానీ సభలు పెట్టనివ్వకుండా బీజేపీని అడ్డుకునేందుకు సీఎం మమతా బెనర్జీ కావాలనే వైరస్ ఉందంటూ లాక్ డౌన్లు విధిస్తున్నారని ఆరోపించారు.
వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీని ప్రజలకు దగ్గర కానివ్వకుండా చేయడమే దీదీ ఎత్తుగడ అని, రాష్ట్రంలో తమను సభలు, సమావేశాలు జరపనివ్వకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కానీ తమను ఎవరూ ఆపలేరని దిలీప్ ఘోష్ స్పష్టం చేశారు. ఓవైపు భారత్ లో నిత్యం వేల సంఖ్యలో కేసులు వస్తున్న సమయంలో దేశంలో కరోనా ఎప్పుడో పోయిందని ఓ రాష్ట్ర బీజేపీ చీఫ్ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.
భారత్ లో తాజాగా ఒక్కరోజులో 96,551 కొత్త కేసులు రాగా, మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45 లక్షలు దాటింది. గడచిన 24 గంటల్లో 1,209 మంది మరణించారు. ఒక్క పశ్చిమ బెంగాల్ లోనే 2 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, ఇప్పటివరకు 3,700 మంది మృత్యువాత పడ్డారు.