KCR: నేను పుట్టిన నా సొంత ఊళ్లోనూ ఇలాగే జరిగింది: సీఎం కేసీఆర్

CM KCR explains how he prefers to implement new revenue act

  • నూతన రెవెన్యూ చట్టంపై సీఎం కేసీఆర్ ప్రసంగం
  • గత రెవెన్యూ విధానాలపై విమర్శలు
  • సమగ్ర సర్వే భూ సమస్యలకు పరిష్కారం అంటూ వ్యాఖ్యలు
  • అంతం కాదు ఆరంభం అంటూ వెల్లడి

నూతన రెవెన్యూ చట్టంపై శాసనసభ్యులు చేసిన సూచనలు, సలహాలపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో అమలు చేసిన రెవెన్యూ విధానం ఎంతో అశాస్త్రీయమైనదే కాకుండా, దురదృష్టకరమైనదని పేర్కొన్నారు. భూములు పంచామని గత పాలకులు చెప్పుకునేవారని, అది లోపభూయిష్టమైన రెవెన్యూ విధానం కారణంగా అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు. చేటలో తవుడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టినట్టు ఉండేదని వ్యాఖ్యానించారు.

సూర్యాపేట మఠంపల్లి భూముల వ్యవహారమే అందుకు ఉదాహరణ అని సీఎం కేసీఆర్ అన్నారు. అక్కడున్నదే 1600 ఎకరాలు అయితే, 9 వేల ఎకరాలకు సర్టిఫికెట్లు ఇచ్చారని వెల్లడించారు. మెదక్ జిల్లా శివంపేటలో 200 ఎకరాల భూమి ఉంటే ఆరేడు వందల ఎకరాలకు సర్టిఫికెట్లు ఇచ్చారని తెలిపారు.

"లక్ష రూపాయలకు ఒక ఎకరం... బిస్కెట్లు అమ్మినట్టు అమ్ముతున్నారట. దాంతో జనాల మధ్య కొట్లాటలు వస్తుంటే  ఈ పంచాయితీలు చేయలేక చచ్చిపోతున్నానంటూ అక్కడి ఎమ్మెల్యే మొత్తుకుంటున్నాడు. ఇలాంటి వ్యవహారాలు ఏళ్ల తరబడి పరంపరగా జరుగుతున్నాయి. నేను పుట్టిన నా సొంతూర్లోనూ ఇలాగే జరిగింది. భూమి ఉన్నది 91 ఎకరం అయితే సర్టిఫికెట్లు 136 మందికి 120 ఎకరాల కింద ఇచ్చారు.

భూముల పంపకం రాజకీయ చర్యగా భావించినంత కాలం ఇలాంటి తప్పిదాలే జరుగుతుంటాయి. ఓ పేద కుటుంబానికి ఆర్థికంగా ఉపయోగపడేందుకు భూమి పంపకం ఉండాలి. కానీ సర్వే లేకుండా ఇష్టారాజ్యంగా భూములు పంపకం చేయడంతో జనాలు తలలు పగుల కొట్టుకుంటున్నారు. ఇచ్చిన భూమి కంటే సర్టిఫికెట్లే ఎక్కువగా ఉంటున్నాయి.

ఇలాంటి లోపాలను తొలగించేందుకే నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తున్నాం. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే. భూ అక్రమాలకు, లోప భూయిష్ట విధానాలకు నూటికి నూరు శాతం పరిష్కారం చూపేది భూ సర్వే మాత్రమే. మార్పును త్వరగా ఎవరూ అంగీకరించరు. కానీ సమగ్ర సర్వేనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని భావిస్తున్నాం" అని వివరించారు.

  • Loading...

More Telugu News