New Revenue Act Bill: నూతన రెవెన్యూ చట్టం బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
- బుధవారం బిల్లు ప్రవేశపెట్టిన సర్కారు
- రెండ్రోజుల పాటు సుదీర్ఘ చర్చ
- బిల్లు ఆమోదం పొందినట్టు ప్రకటన చేసిన స్పీకర్ పోచారం
భూ అక్రమాలు, సమస్యలకు అడ్డుకట్ట వేసే నిమిత్తం తీసుకువచ్చిన నూతన రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సభలో దీనిపై మూజువాణి ఓటింగ్ విధానం అనుసరించారు. ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటన చేశారు. ఈ బిల్లు ఎలాంటి సవరణలు లేకుండానే ఆమోదం పొందిందని వివరించారు.
నూతన రెవెన్యూ చట్టం ప్రకారం ఇకపై వీఆర్వో వ్యవస్థ తెరమరుగు కానుంది. ఇకపై ఎమ్మార్వోలే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విధులు నిర్వర్తించనున్నారు. ఒకేసారి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియలు జరుగుతాయి. తెలంగాణ ధరణి పోర్టల్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఈ బిల్లును బుధవారం నాడు ప్రవేశపెట్టగా రెండ్రోజుల పాటు సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం ఆమోదం పొందింది. సభ్యులు ఈ బిల్లుపై లేవనెత్తిన సందేహాలకు, ప్రశ్నలకు సీఎం కేసీఆర్ ఓపిగ్గా బదులిచ్చారు. మొత్తమ్మీద ఎలాంటి అవాంతరాలు లేకుండా బిల్లుకు ఆమోదం లభించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.