Rhea Chakraborty: ఫ్యాన్ లేదు, బెడ్ లేదు... ఇంద్రాణి ముఖర్జీ పక్క సెల్ లోనే రియా!
- సుశాంత్ మృతి కేసులో రియా అరెస్ట్
- బైకుల్లా జైలుకు తరలింపు
- సాధారణ ఖైదీలా రియా!
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వ్యవహారంలో అరెస్ట్ అయిన నటి రియా చక్రవర్తిని ముంబయిలోని బైకుల్లా జైలులో ఉంచారు. రియాను ఉంచిన సెల్ పక్కనే ఇంద్రాణి ముఖర్జీ సెల్ ఉంది. తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జీ ఆరోపణలు ఎదుర్కొంటోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... రియాకు కేటాయించిన సెల్ లో ఫ్యాన్ గానీ, బెడ్ గానీ లేవు. జైలు సిబ్బంది ఆమె పడుకోవడానికి ఓ చాప ఇచ్చారు. కనీసం దిండు కూడా ఇవ్వలేదట. దీనిపై అధికారులు స్పందిస్తూ, కోర్టు అనుమతిస్తే రియాకు టేబుల్ ఫ్యాన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జైల్లో అందరు ఖైదీలకు మాదిరే రియాకు కూడా పసుపు కలిపిన పాలు ఇస్తున్నామని, కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకుని ఖైదీల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ముంబయిలో మహిళల కోసం ప్రత్యేకించిన బైకుల్లా జైల్లో గత కొన్నివారాలుగా కరోనా పాజిటివ్ కేసులు వెల్లడవుతున్నాయి.
కాగా, సుశాంత్ మరణం వెనుక డ్రగ్స్ కోణం ఉందన్న అనుమానంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) లోతైన దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగానే రియాను విచారించి, ఆపై అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. బైకుల్లా జైలులో రియాను ఉంచిన సెల్ కు ఇద్దరు కానిస్టేబుళ్లు మూడు షిఫ్టుల విధానంలో భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు.