Suicide: హైదరాబాదులో విషాదం... కరోనా నివారణ మందు అంటూ తండ్రికి పురుగుల మందు ఇచ్చి తానూ తాగిన యువకుడు!

Youth commits suicide due to financial problems in Hyderabad

  • లాక్ డౌన్ తో నష్టపోయిన యువకుడు
  • బకాయిలు వసూలు కాక ఆర్థిక ఇబ్బందులు
  • పురుగుమందు తాగి ఆత్మహత్య
  • తండ్రి పరిస్థితి విషమం

హైదరాబాదులో విషాద ఘటన చోటుచేసుకుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా జీవితాలు ఎలా ప్రభావితమయ్యాయో చెప్పేందుకు ఈ ఘటన ఓ ఉదాహరణ! వివరాల్లోకి వెళితే.... పంజాగుట్ట ఎర్రమంజిల్ హిల్ టాప్ కాలనీలో నివసించే ఆలంపాటి అనీష్ రెడ్డి (35) ఐటీ కంపెనీల కార్యాలయాలకు భోజనం సరఫరా చేసే కాంట్రాక్టర్. అతడు తన తల్లిదండ్రులు రామిరెడ్డి, శ్రావణిరెడ్డిలతో కలిసి ఉంటున్నాడు.

అయితే లాక్ డౌన్ పరిస్థితుల్లో అనీష్ రెడ్డి వ్యాపారం బాగా దెబ్బతింది. వ్యాపారం ఆగిపోవడంతో పాటు, కంపెనీల నుంచి రావాల్సిన బకాయిలు కూడా వసూలు కాలేదు. దాంతో ఆర్థిక ఇబ్బందులు తీవ్రస్థాయికి చేరాయి. ఆర్థిక నష్టాల నుంచి బయటపడడం అసాధ్యమని భావించి అనీష్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ తాను చనిపోతే తల్లిదండ్రులు బతకలేరని భావించి వారిని కూడా ఈ లోకం నుంచి తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నాడు.

బుధవారం రాత్రి తల్లిదండ్రులు నిద్రిస్తుండగా, వారిని లేపి కరోనా నివారణ మందు తెచ్చానంటూ గ్లాసుల్లో పురుగు మందు పోశాడు. ఓ గ్లాసు తండ్రికి ఇచ్చి, మరో గ్లాసులో ఉన్నది తాను తాగాడు. ఇదే సమయంలో వంట గదిలోకి వెళ్లడంతో తల్లి ఆ గ్లాసులోని పురుగుమందు తాగలేదు. ఆమె వంటగదిలోంచి వెలుపలికి వచ్చేసరికి అనీష్ రెడ్డి, రామిరెడ్డి వాంతులు చేసుకుంటూ కనిపించారు. దాంతో వారిని సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అనీష్ రెడ్డి ఎక్కువగా పురుగుమందు తాగడంతో అతడు కొద్దిసేపటికే మరణించాడు. తండ్రి రామిరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. తల్లి శ్రావణిరెడ్డి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News