Nutan Naidu: ఉద్యోగాల పేరుతో నూతన్ నాయుడి మోసం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు!
- స్థిరాస్తి వ్యాపారుల నుంచి కోట్లు వసూలు
- నూతన్ నాయుడి చేతిలో మోసపోయిన విశాఖ, చేవెళ్ల వాసులు
- రెండేళ్లయినా ఉద్యోగం ఊసు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు
శిరోముండనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన నూతన్ నాయుడుకు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు ఉద్యోగాల పేరుతో ఇద్దరిని నమ్మించి రూ. 12 కోట్ల మేర మోసానికి పాల్పడినట్టు ఆరోపిస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదు ప్రకారం.. విశాఖపట్టణం జిల్లా రావికమతం ప్రాంతానికి చెందిన నూకరాజు, తెలంగాణలోని చేవెళ్లకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి స్థిరాస్తి వ్యాపారులు. ఈ క్రమంలో నూతన్ నాయుడితో వారికి పరిచయం ఏర్పడింది. పరిచయం బాగా స్నేహంగా మారాక భారతీయ స్టేట్ బ్యాంకులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నూతన్ నాయుడు తమతో చెప్పడంతో నమ్మి డబ్బులు చెల్లించినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దక్షిణ భారత రీజియన్ డైరెక్టర్ పోస్టు కోసం తాను రూ. 12 కోట్లు చెల్లించినట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించగా, సాధారణ ఉద్యోగం కోసం రూ. 5 లక్షల ఇచ్చినట్టు నూకరాజు ఆరోపించాడు.
డబ్బులు చెల్లించి రెండేళ్లు పూర్తయినా ఉద్యోగాల ఊసు లేకపోవడంతో మోసపోయామని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రూ. 12 కోట్లు చెల్లించగలిగేంత స్తోమత శ్రీకాంత్‌రెడ్డికి ఉందా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో నూతన్ నాయుడికి సహకరించిన శశికాంత్ అనే వ్యక్తిపైనా కేసు నమోదు చేసినట్టు మహారాణిపేట పోలీసులు తెలిపారు.