Yanamala: వైయస్ కుటుంబం చేసిన కొల్లూరు భూముల కుంభకోణం అందరికీ తెలిసిందే: యనమల
- జగన్ ఆలోచనలన్నీ నేరపూరితంగా ఉంటున్నాయి
- కక్షసాధింపులకు పాల్పడుతున్నారు
- వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారు
ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలన్నీ నేరపూరితంగా ఉంటున్నాయని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. మూడు ముక్కలాట వంటి తుగ్లక్ చర్యలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతిన్నదని అన్నారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రాజధాని భూములపై సిట్ నివేదికను లీక్ చేయడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని యనమల అన్నారు. వైసీపీ అవినీతిని బయటపెట్టారనే అక్కసుతో జగన్ ఇలాంటి కక్షసాధింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. కేబినెట్ సబ్ కమిటీలో ఉన్నది జగన్ అనుచరులేనని... జగన్ ఆలోచనలనే ప్రభుత్వం వేసిన సిట్ చెబుతుందని అన్నారు. ఐదేళ్ల తర్వాత అమరావతి సరిహద్దుల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తుండటం కూడా కక్షసాధింపేనని చెప్పారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును అష్టవంకర్లు తిప్పిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిదేనని యనమల విమర్శించారు. మెదక్ జిల్లాలో వైయస్ కుటుంబం చేసిన కొల్లూరు భూముల కుంభకోణం అందరికీ తెలిసిందేనని అన్నారు. తాను చేసినట్టే అందరూ వందల కోట్ల విలువైన భూకుంభకోణాలకు పాల్పడతారనే భావన జగన్ దని... ఆయన ఆలోచన విధానమే సరైంది కాదని చెప్పారు. ఇప్పటికైనా ప్రతీకారేచ్ఛ, నేరపూరిత ఆలోచనలకు జగన్ ముగింపు పలకాలని హితవు పలికారు.